పాకిస్థాన్ 'బీప్ పాకిస్థాన్' పేరుతో సొంత మెసేజింగ్ యాప్‌ను తాజాగా ఆవిష్కరించింది. ఈ యాప్‌ను ఆ దేశ ఐటీ శాఖ, నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డు కలిసి రూపొందించాయి. పాక్‌లో డెవలప్ అయిన ఫస్ట్ కమ్యూనికేషన్ యాప్ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ప్రభుత్వం ఈ అప్లికేషన్‌ను 30 రోజుల పాటు పరీక్షిస్తోంది. ఈ యాప్‌ను ఒక సంవత్సరం టెస్ట్ చేశాక, ప్రజలకు రిలీజ్ చేస్తామని పాకిస్థాన్ ఐటీ మంత్రి అమీనుల్ హక్ తెలిపారు. కట్టుదిట్టమైన ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్లు, మెసేజ్, డాక్యుమెంట్ షేరింగ్.. క్విక్ ఆడియో, వీడియో, కాన్ఫరెన్స్ కాల్స్ వంటి ఫీచర్లు ఈ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నాయని హక్ వెల్లడించారు. సైబర్ అటాక్‌ల నుంచి ప్రభుత్వ కమ్యూనికేషన్‌ను ప్రొటెక్ట్ చేయడానికి దీనిని డెవలప్ చేశామని, ఈ యాప్ ప్రభుత్వ విభాగాల్లో కమ్యూనికేషన్‌ను మరింత సమర్థవంతంగా మారుస్తుందని NITB సీఈఓ బాబర్ మజీద్ భట్టి తెలిపారు. బీప్ పాకిస్థాన్ అనేది ప్రభుత్వ కార్యకలాపాలను మోడర్నైజ్ చేయబోయే ఒక గేమ్-ఛేంజింగ్ ప్లాట్‌ఫామ్ అని భట్టి పేర్కొన్నారు. "బీప్ పాకిస్థాన్ యాప్ మంత్రిత్వ శాఖల మధ్య సజావుగా సహకారాన్ని అందిస్తుంది, పాలసీ మేకర్స్‌కు విలువైన ఇన్ఫర్మేషన్, డేటాను అందజేస్తుంది. తద్వారా వారు తెలివైన, పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రభుత్వ శాఖలను ఇంటిగ్రేట్ చేసి ప్రభుత్వాధికారులు పౌరులకు నేరుగా మెరుగైన సేవలను అందించే సదుపాయం ఆఫర్ చేస్తుంది. ఇవన్నీ సురక్షితమైన ప్లాట్‌ఫామ్‌లో జరుగుతాయి." అని చెప్పుకొచ్చారు. బీప్ పాకిస్థాన్ లోకల్ సర్వర్‌లలో యూజర్ డేటాను నేషనల్ ఐటీ బోర్డ్ పర్యవేక్షిస్తుందని ఐటీ మంత్రి అమీనుల్ హక్ తెలిపారు. ఈ మెసేజింగ్ యాప్‌లో ఆడియో, వీడియో లీక్‌లకు తావుండదని, యాప్ 100% సెక్యూర్‌గా ఉంటుందని, ఎందుకంటే దాని సర్వర్లు, సోర్స్ కోడ్ పాకిస్తాన్‌లో ఉన్నాయని వివరించారు.
ఈ అప్లికేషన్‌కు ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్ల కోసం యూజర్లు ఉపయోగించగల సామర్థ్యం కూడా ఉండనుంది. కస్టమర్లకు ఉత్పత్తులు, సేవలను విక్రయించడానికి వ్యాపారాలు బీప్ పాకిస్థాన్‌ను ఉపయోగించుకోవచ్చని ఆ దేశాధికారులు తెలిపారు. సాంకేతిక స్వాతంత్య్రాన్ని పాక్ నొక్కిచెప్పడానికి కొత్త యాప్ ఉదాహరణగా కూడా మారుతుందని చెప్పవచ్చు. రీసెంట్ టైమ్‌లో ఈ దాయాది దేశం ఐటీ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టింది. బీప్ పాకిస్థాన్‌ను ప్రారంభించడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. మరి బీప్ పాకిస్థాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సెక్యూరిటీ, ప్రైవసీ విషయంలో మెరుగ్గా ఉంటే ఈ అప్లికేషన్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ.
No comments:
Post a Comment