Ad Code

యూట్యూబ్‌లో వైద్యపరమైన తప్పుడు సమాచారం వ్యాప్తిపై కఠిన చర్యలు !


యూట్యూబ్‌లో వైద్యపరమైన తప్పుడు సమాచారం వ్యాప్తిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఆగస్టు 15 నుంచి యూట్యూబ్‌ తప్పుడు సమాచారాన్ని తీసివేయడం ప్రారంభించింది. రాబోయే వారాల్లో ఈ చర్యలు కొనసాగుతాయి. కచ్చితమైన, విశ్వసనీయమైన వైద్య సమాచారాన్ని కోరుకునే వినియోగదారుల కోసం సేఫ్ ప్లేస్ సృష్టించడం తమ లక్ష్యమని యూట్యూబ్ పేర్కొంది. లక్షలాది మంది వినియోగదారులు వైద్య సలహా సహా వివిధ రకాల సమాచారం కోసం యూట్యూబ్‌పై ఆధారపడుతున్నారు. దీంతో తప్పుదారి పట్టించే, సరికాని కంటెంట్‌కు యూట్యూబ్‌ హాట్‌స్పాట్‌గా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి, వైద్యపరమైన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వీడియోలను తీసివేయడానికి యూట్యూబ్‌ కొత్త చర్యలను ప్రకటించింది. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు యూట్యూబ్ అప్‌డేటెడ్‌ అప్రోచ్‌ను ప్రకటించింది. ప్లాట్‌ఫారం కొత్త నియమాలను ప్రివెన్షన్‌, ట్రీట్‌మెంట్‌, డినైల్‌ అనే మూడు కేటగిరీలుగా పేర్కొంది. స్థానిక ఆరోగ్య అధికారులు లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు విరుద్ధంగా కంటెంట్ ఉన్న ఆరోగ్య విషయాలను ఈ కేటగిరీలు కవర్ చేస్తాయి. హానికరమైన కంటెంట్‌ను గుర్తించడం, తీసివేయడం సులువుగా మార్చేందుకు ఈ అప్రోచ్‌ను కంపెనీ అమలు చేయనుంది. యూట్యూబ్‌ ఇప్పుడు సురక్షితం కాని లేదా అసమర్థమైన క్యాన్సర్ చికిత్సలు, సలహాలను సూచించే వీడియోలను తీసివేస్తుంది. ప్రొఫెషనల్‌ మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ను నిరుత్సాహపరిచే వీడియోలను కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్, కోవిడ్-19, వ్యాక్సిన్‌లు, రీప్రొడక్టివ్‌ హెల్త్‌ వంటి అంశాల్లో అన్‌ ప్రూవెన్‌ హెల్త్‌ మెథడ్స్‌ ప్రోత్సహించడానికి ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించినందుకు ఈ చర్యలు తీసుకుంది. నిర్దిష్ట ఆరోగ్య పరిస్థితులను నిరోధించడం, ప్రసారం చేయడం, అలాగే అప్రూవ్డ్‌ వ్యాక్సిన్‌ల భద్రత, సమర్థత గురించి ఆరోగ్య అధికార మార్గదర్శకానికి విరుద్ధంగా ఉండే కంటెంట్‌ను తొలగిస్తుంది. సరైన వైద్య సంరక్షణకు బదులుగా హానికరమైన పదార్థాలు లేదా అభ్యాసాలను ప్రచారం చేయడంతో పాటు నిర్దిష్ట పరిస్థితులకు చికిత్స చేయడంలో ఆరోగ్య అధికార సలహాకు విరుద్ధంగా ఉన్న కంటెంట్‌ను రిమూవ్‌ చేస్తుంది. COVID-19 సంబంధిత మరణాలను తిరస్కరించడం వంటి నిర్దిష్ట ఆరోగ్య పరిస్థితుల ఉనికిని డినైల్‌ చేసే కంటెంట్‌ను తీసివేస్తుంది. హానికరమైన లేదా అసమర్థమైన క్యాన్సర్ చికిత్సలను ప్రోత్సహించే, వృత్తిపరమైన వైద్య సహాయాన్ని నిరుత్సాహపరిచే కంటెంట్‌ను తీసివేస్తామని యూట్యూబ్‌ స్పష్టం చేసింది. ఉదాహరణకు అప్రూవ్డ్‌ మెడికల్ కేర్‌కి ప్రత్యామ్నాయంగా అన్‌ప్రూవెన్‌ ట్రీట్‌మెంట్స్‌ను సూచించే వీడియోలను అనుమతించదు. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఎడ్యుకేషనల్‌, సైంటిఫిక్‌ వీడియోలు, డాక్యుమెంటరీలను ప్రొఫెషనల్‌ కేర్‌ తీసుకోవడాన్ని నిరుత్సాహపరచనంత వరకు అనుమతిస్తుంది. ప్లాట్‌ఫామ్‌లో అటువంటి కంటెంట్‌ను ఉంచాలా వద్దా అని నిర్ణయించేటప్పుడు యూట్యూబ్‌ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ను పరిగణనలోకి తీసుకుంటుంది.




Post a Comment

0 Comments

Close Menu