Ad Code

సెమీకండక్టర్ ఇండస్ట్రీలో చైనా రారాజు !


సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో చైనాను అగ్రగామిగా నిలిపేందుకు గాను ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను 40 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.3 లక్షల కోట్లు) నిధిని ఏర్పాటు చేయనున్నది. అమెరికాతో పాటు ఈ రంగంలో తమ ప్రత్యర్థులను వెనక్కు నెట్టేలా సెమీ కండకర్ ఇండస్ట్రీని అందనంత ఎత్తుకు తీసుకెళ్లాలని చైనా నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ భారీ ఫండ్‌ను ఏర్పాటు చేయడానికి నిధుల సమీకరణ మొదలు పెట్టింది. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సెమీకండక్టర్ల ప్రాధాన్యత ఎంతో ఎక్కువ. మొబైల్ ఫోన్ల నుంచి అంతరిక్ష ప్రయోగాల వరకు వీటిపైనే ఎక్కువగా ఆధార పడతారు. కానీ ఈ ఇండస్ట్రీలో ఉత్పత్తి అనుకున్నంత వేగంగా సాగడం లేదు. అందుకే ఈ రంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోడానికి చైనా భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. చైనా ఇలాంటి భారీ ఫండ్‌ను ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో 2104, 2019లో రెండు సార్లు ఇలాంటి భారీ నిధుల సేకరణను చేపట్టింది. 2014లో 138.7 బిలియన్ యువాన్లు, 2019లో 200 బిలియన్ యువాన్ల నిధులను సేకరించింది. ఇక ఇప్పుడు సేకరించబోయే నిధులను చిప్ మాన్యుప్యాక్చరింగ్ రంగానికే ఎక్కువగా కేటాయించనున్నట్లు తెలుస్తున్నది. సెమీకండక్టర్ల విషయంలో చైనా స్వయం సమృద్ధి సాధించడమే ఆ దేశాధ్యక్షుడు జి జిన్‌పింగ్ లక్ష్యంగా పెట్టారు. సెమీకండక్టర్ల ఎగుమతి విషయంలో అమెరికా అనేక ఆంక్షలు పెట్టడంతో చైనా ఈ నిర్ణయం తీసుకున్నది. తమ మిలటరీ అవసరాల కోసమే కాకుండా దేశంలోని ఇతర అవసరాలకు సెమీకండక్టర్లను చైనాలోనే భారీ ఎత్తున తయారు చేసేందుకు ఈ నిధిని ఉపయోగించనున్నది. చైనాకు చెందిన రెండు చిప్ తయారీ సంస్థలకు ఈ నిధులు వెచ్చించే అవకాశం ఉన్నది. చైనా చిప్ ఇండస్ట్రీ ఇప్పటికీ అంతర్జాతీయంగా కీలకమైన పాత్ర పోషించడంలో సతమతం అవుతోంది. దీన్ని అధిగమించడానికి ఈ నిధి తప్పకుండా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇంత భారీ నిధులతో సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో రారాజుగా నిలవాలని చైనా భావిస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu