Ad Code

సెమీ కండక్టర్ల రంగంలోకి రిలయన్స్ ?


దేశీయంగా సెమీ కండక్టర్ల తయారీపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫోకస్ పెట్టింది. భాగస్వామ్య సంస్థల కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కార్లు మొదలు స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో సెమీ కండక్టర్ చిప్‌లు కీలకం. వాటి సరఫరా కోసం చైనా, తైవాన్‌ పైనే ఆధార పడాల్సి వస్తున్నది. సరఫరాలో కొరత కారణంగా కార్ల తయారీలో జాప్యం కూడా జరుగుతున్నది. రోజురోజుకు దేశీయంగా సెమీ కండక్టర్లకు గిరాకీ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రజల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న ముకేశ్ అంబానీసారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సెమీ కండక్టర్లను తయారు చేసేందుకు గల అవకాశాలపై ఫోకస్ పెట్టిందని సమాచారం. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో విదేశీ చిప్ మేకర్లతో రిలయన్స్ సంపద్రింపులు జరుపుతున్నది. సెమీ కండక్టర్ల తయారీలో టెక్నాలజీ భాగస్వాములయ్యేందుకు అవకాశం గల సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని పేర్కొంది. ఇందుకు నిర్దిష్ట గడువేదీ లేదని కూడా రిలయన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. సెమీ కండక్టర్ల రంగంలో పెట్టుబడులు పెట్టాలన్నదే తమ అభిమతం అని రిలయన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఏయే విదేశీ సంస్థలతో సంప్రదించారన్న సంగతి రిలయన్స్ వెల్లడించలేదు. దీనిపై కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ గానీ, ప్రధాని నరేంద్రమోదీ కార్యాలయం గానీ స్పందించడానికి ముందుకు రాలేదు. వేదాంతా, తైవాన్ ఫాక్స్‌కాన్ వేర్వేరుగా దేశంలో సెమీ కండక్టర్ల సంస్థలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్ పరిధిలో సెమీ కండక్టర్ల తయారీకి అవసరమైన లోహ నిల్వలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో దేశీయంగా సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ స్థాపనకు ప్రయత్నాలు జోరందుకుంటున్నట్లు తెలుస్తున్నది.

Post a Comment

0 Comments

Close Menu