Ad Code

ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రభుత్వ హెచ్చరిక !


ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఐటీ, సమాచార మంత్రిత్వ శాఖ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్  హెచ్చరికను జారీ చేసింది. ఇందులో ఆండ్రాయిడ్ 13, దాని మునుపటి వెర్షన్లను ఉపయోగించేవారిని హెచ్చరించారు. ఈ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంల్లో చాలా లోపాలు ఉన్నాయని, ఇది వినియోగదారులకు ప్రమాదకరంగా మారుతుందని తెలిపారు. ఆండ్రాయిడ్ 13లో కనిపించే ఈ లోపాలను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వివరించింది. ఇది ఆండ్రాయిడ్ 13 వినియోగదారులకు ముప్పుగా మారుతోందని స్పష్టం చేసింది. హ్యాకర్లు ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం ఉన్న మొబైల్స్ ను త్వరగా హ్యాక్ చేయగలరని, సమాచారంతో పాటు మీ డిజిటల్ వాలెట్ నుంచి డబ్బును కూడా దొంగిలించవచ్చని తెలిపింది. ఈ బలహీనతలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా హ్యాకర్లు తమ కోడ్ ను డివైజ్ లో ఇన్స్టాల్ చేయడం, డివైజ్ కు యాక్సెస్ పొందడం, వినియోగదారుల మొత్తం సమాచారాన్ని దొంగిలించడం వంటి పనులను సులభంగా చేయగలరని ప్రభుత్వం హెచ్చరించింది. సెర్ట్ కథనం ప్రకారం ఈ జాబితాలో ఆండ్రాయిడ్ 11, ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 12ఎల్, ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తున్న డివైస్ లు ఉన్నాయి. ఈ లోపాలు కేవలం ఒక కాంపోనెంట్ కే పరిమితం కాకుండా పరికరంలోని వివిధ భాగాలలో ఉన్నాయి. ఫ్రేమ్ వర్క్, సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్ ల వంటి ముఖ్యమైన భాగాల్లో కూడా లోపాలు ఉన్నాయి. అలాగే ఏఎర్ఎం, మీడియాటెక్, యూనిసోక్, క్వాల్కాం వంటి అనేక హార్డ్వేర్ తయారీదారుల నుంచి వచ్చే భాగాలు, క్వాల్కాం క్లోజ్డ్ సోర్స్ భాగాలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి. గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం అప్డేట్ ను విడుదల చేసింది. ఇది ఈ సమస్యలన్నింటినీ తొలగిస్తుంది. ఫోన్ ని ఇంకా అప్డేట్ చేయకుంటే, ముందుగా చేయాల్సింది అప్డేట్ చేయడమే. ఎల్లప్పుడూ సెక్యూరిటీ ప్యాచ్ లను అప్డేట్ చేయాలి. ఫోన్ కి ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్లు వస్తుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు ఇన్స్టాల్ చేయాలి. ఇది ఫోన్ లో ఉన్న లోపాలను తొలగిస్తుంది. భద్రతను కూడా పెంచుతుంది. అలాగే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. థర్డ్ పార్టీ యాప్ లతో జాగ్రత్తగా ఉండండి. గూగుల్ ప్లే స్టోర్ కాకుండా మిగతా సోర్స్ ల నుంచి యాప్ లను డౌన్లోడ్ చేయవద్దు. ఏదైనా లింక్ నుంచి డౌన్లోడ్ చేసిన థర్డ్ పార్టీ యాప్లు ప్రమాదకరంగా మారవచ్చు. ఏదైనా యాప్ మిమ్మల్ని అనుమతులు అడుగుతున్నట్లయితే, ఆ యాప్ కు అనుమతులు అవసరమా కాదా అని మీరు ముందుగా చెక్ చేయాలి. అవసరం లేకుంటే పర్మిషన్లు ఇవ్వొద్దు.

Post a Comment

0 Comments

Close Menu