Ad Code

సిమ్ స్వాప్ తో ఖాతా ఖాళీ ?

ఢిల్లీకి చెందిన ఓ 35 ఏళ్ల మహిళా లాయర్ ఫోన్‌కు తాజాగా మూడు మిస్డ్ కాల్‌లు వచ్చాయి. ఆ తర్వాత ఆమె ఖాతా నుంచి వరుసగా డబ్బులు ఆమెకు సంబంధం లేకుండా డెబిట్ అయి పోయాయి. ఆమె స్పందించి ఫిర్యాదు చేసే లోపే ఖాతా మొత్తం ఖాళీ అయిపోయింది. ఇదంతా ఎలా జరిగిందని ఆ తర్వాత తెలుసుకుంటే ఆమె వాడుతున్న మొబైల్ ఫోన్ సిమ్ స్వాప్ అయినట్లు తెలిసింది. అంటే మీరు వాడుతున్న నంబర్ సిమ్ కార్డునే స్వాప్ చేసి మరొకటి సృష్టించి డబ్బు కాజేయడం అన్నమాట. ఇంతకీ ఈ సిమ్ స్వాప్ స్కాం ఎలా జరుగుతోందో తెలుసుకుంటే సదరు మహిళకు ఒక నంబర్ నుండి మూడు మిస్డ్ కాల్‌లు వచ్చాయి. కొద్దిసేపటికే తన బ్యాంక్ ఖాతాలో డబ్బులు డెబిట్ అయినట్లు ఆమెకు మేసెజ్ లు వచ్చాయి. కానీ ఆమె ఎవరికీ ఎటువంటి ఓటీపీ లేదా వ్యక్తిగత వివరాలను వెల్లడించలేదు. అయినప్పటికీ ఆమె డబ్బును పోగొట్టుకుంది. ఈనెల 18న జరిగిన ఈ ఘటనపై న్యాయవాది అధికారులకు ఫిర్యాదు చేయగా, ఆమె లక్షల రూపాయలు నష్టపోయినట్లు తేలింది. తనకు మొత్తం మూడు కాల్‌లు వచ్చాయని ఆమె నిర్ధారించింది. మరొక నంబర్‌ని ఉపయోగించి తిరిగి కాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, అది కొరియర్ డెలివరీ కోసం అని ఆమెకు సమాచారం వచ్చింది. ఇంతకీ ఆమె చేసింది ఏంటంటే తన ఇంటి చిరునామాను నిందితుడికి షేర్ చేసింది. అయితే ఆమె ఓ కొరియర్ కోసం తన అడ్రెస్ ఇచ్చింది. దీన్ని తన మొబైల్ నంబర్ కు లింక్ చేసి ఓ ఫేక్ సిమ్ తయారు చేసి దాన్ని ఒరిజినల్ తో స్వాప్ చేయడానికి మిస్డ్ కాల్స్ ఇచ్చినట్లు తేలింది. అలాగే తన ఫోన్ కు అసాధారణ ఫిషింగ్ లింక్స్, ఇతర మెసేజ్ లు వచ్చాయని, అలాగే ఆమెకు తెలియకుండానే బ్రౌజింగ్ హిస్టరీలో పలు అంశాల్ని వీక్షించినట్లు ఉందని తేలింది. ఇదంతా గమనిస్తే ఆమె సిమ్ స్వాప్ చేయడం ద్వారా ఆమె ఫోన్ లోకి వెళ్లి అప్పటికే పంపిన లింక్స్ ను క్లిక్ చేసి ఈ డబ్బులు కొట్టేసినట్లు తెలిసింది. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ స్కామ్‌లో సిమ్ స్వాప్ స్కామర్‌ల ప్రాథమిక లక్ష్యం వ్యక్తిగత డేటాను పొందడం. వారు డూప్లికేట్ సిమ్ పొందేందుకు మొబైల్ నెట్‌వర్క్‌లోని ఎవరి సాయం అయినా తీసుకోవచ్చు. ప్లాట్‌ఫారమ్‌తో సంబంధం లేకుండా మీ చిరునామా లేదా ఆధార్ కార్డ్ , పాన్ వివరాల వంటి వ్యక్తిగత డాక్యుమెంటేషన్‌తో సహా వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ పోస్ట్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిని ధృవీకరించుకోకుండా మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ ఇవ్వొదని చెబుతున్నారు. అలాగే మీ సిమ్ కార్డ్ పని చేయకపోతే, ముఖ్యంగా అది యాదృచ్ఛికంగా జరిగితే వెంటనే టెలికాం ఆపరేటర్‌కు తెలియజేయాలి.వాస్తవానికి, అధికారులు లేదా బ్యాంకింగ్ ఏజెంట్లుగా నటిస్తూ కాల్ చేసే వ్యక్తులకు ఓటీపీలు షేర్ చేయకూడదని చెబుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu