రాకెట్ దాడుల నుంచి ప్రజలు తప్పించుకోవడానికి ఇజ్రాయెల్ వినియోగించే ఓ యాప్‌పై హ్యాకర్లు కన్నేసినట్లు అమెరికాకు చెందిన ఓ టెక్ కంపెనీ హెచ్చరికలు జారీ చేసింది. రాకెట్ దాడుల నుంచి తప్పించుకొనేందుకు 'రెడ్ అలర్ట్' పేరిట ఒక ఓపెన్ సోర్స్ యాప్‌ను వినియోగిస్తున్నారు. తాజాగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు పెరిగిపోవడంతో ఈ యాప్‌నకు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా కొందరు హ్యాకర్లు ఈ యాప్ తప్పుడు వెర్షన్‌ను సృష్టించి అందుబాటులోకి తెచ్చారు. ఇది పనితీరులో సాధారణ రెడ్‌అలర్ట్ వలే ఉంటుంది. కానీ, బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రం స్పైవేర్ పనిచేస్తుందని అమెరికాకు చెందిన టెక్ కంపెనీ క్లౌడ్‌ఫ్లేర్ నివేదికలో హెచ్చరించింది. ఈ తప్పుడు యాప్ వినియోగదారుల డేటాను సేకరిస్తున్నట్లు గుర్తించింది. ముఖ్యంగా కాల్స్ లాగ్, ఎస్‌ఎంఎస్, అకౌంట్ ఇన్ఫర్మేషన్, దీంతోపాటు ఆ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన యాప్స్ వివరాలు తస్కరిస్తున్నట్లు క్లౌడ్‌ఫ్లేర్ వెల్లడించింది. ఈ యాప్‌ను ఇజ్రాయెల్ ప్రజలు ఇన్‌స్టాల్ చేసేందుకు ఓ తప్పుడు వెబ్‌సైట్‌ను కూడా క్రియేట్ చేశారు. ఈ సైట్ అక్టోబర్ 12వ తేదీ నుంచి పనిచేస్తోంది. ఇందులో ఆండ్రాయిడ్, ఐవోఎస్ వెర్షన్ యాప్‌లను పెట్టారు. ఐవోఎస్ వెర్షన్ బటన్‌పై క్లిక్ చేసే యాపిల్ స్టోర్‌లోని నిజమైన పేజీకి తీసుకెళుతుంది. కానీ, ఆండ్రాయిడ్ లింక్‌పై క్లిక్ చేస్తే మాత్రం ఒక ఏపీకే ఫైల్ నేరుగా ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవుతోంది. ఇందులో కూడా నిజమైన రెడ్‌అలర్ట్‌లో వాడిన కోడ్‌ను వినియోగించారు. కానీ, ఈ అనుమానాస్పద యాప్‌లలో యాంటీ డీబగ్గింగ్, యాంటీ ఎమ్యూలేషన్, యాంటీ టెస్ట్ సాఫ్ట్‌వేర్లను వాడారు. ఇవి రీసెర్చర్లు, కోడ్ సమీక్షించే టూల్స్‌ను ఏమారుస్తాయి. ఈ యాప్ అనవసరమైన అనుమతులు కూడా అడుగుతుంది. దీని ఆధారంగానే అది అసలైన రెడ్‌అలర్ట్ యాప్ అవునో..కాదో గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఫోన్లలోకి స్పైవేర్ !
0
October 17, 2023
Tags