Ad Code

సైబర్‌క్రైమ్స్ ప్రోత్సహించేలా వాట్సాప్ కొత్త ఫీచర్‌ ?


వాట్సాప్ యూజర్లకు మెరుగైన ప్రైవసీ అందించడానికి సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. రీసెంట్‌గా ఆండ్రాయిడ్, iOS బీటా టెస్టర్లకు "ప్రొటెక్ట్ IP అడ్రస్ ఇన్ కాల్‌" పేరుతో మరో ఫీచర్‌ను రిలీజ్ చేసింది. ఈ కొత్త ఫీచర్‌ యాప్‌లో కాల్ చేసినప్పుడు యూజర్ IP అడ్రస్‌ను దాచిపెడుతుంది. దీనివల్ల యూజర్ల ప్రైవసీ మరింత ఇంప్రూవ్ కానుంది. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫీచర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ స్పెసిఫికేషన్‌ వల్ల సైబర్ నేరగాళ్లు, ఉగ్రవాదులు పోలీసులు, చట్టం నుంచి తప్పించుకోవడం సులభతరం అవుతుందని భావిస్తున్నారు. IP అడ్రస్ అనేది ఇంటర్నెట్ లేదా మొబైల్ నెట్‌వర్క్‌లో ఒక యూజర్ డివైజ్‌ను ఐడెంటిఫై చేసే స్పెషల్ నంబర్. ఇది యూజర్ ఎక్కడ ఉన్నారో, వారి నెట్‌వర్క్ ప్రొవైడర్ ఎవరో కూడా చూపుతుంది. వాట్సాప్‌లో ఎవరికైనా కాల్ చేసినప్పుడు, IP అడ్రస్ అవతలి వ్యక్తి IP అడ్రస్‌కు కనెక్ట్ అవుతుంది. ఈ సమాచారం ఫోన్ మెటాడేటాలో స్టోర్ అవుతుంది. మెటాడేటా అనేది డేటాకు సంబంధించిన డేటా. ఇది యూజర్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా కాల్ చేసారో చెప్పగలదు. వాట్సాప్ కాల్ సమయంలో ఎవరైనా సైబర్ క్రైమ్‌కు పాల్పడితే, పోలీసులు వారి IP అడ్రస్ కనుగొనడానికి మెటాడేటాను ఉపయోగించవచ్చు. కొత్త ఫీచర్ ఈ ప్రక్రియకు అడ్డంకిగా మారుతుంది. కొత్త ఫీచర్‌తో వాట్సాప్ కాల్స్ ట్రాక్ చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే కొత్త ఫీచర్‌ వల్ల యూజర్ IP అడ్రస్‌ నేరుగా అవతలి వ్యక్తి IP అడ్రస్‌కు కనెక్ట్ అవ్వదు. అందుకు బదులుగా, ముందుగా వాట్సాప్ సొంత సర్వర్‌లకు చేరుకుంటుంది, ఆ తర్వాతనే అవతలి వ్యక్తి IP అడ్రస్‌కు కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా, వాట్సాప్ IP అడ్రస్‌ మాత్రమే యూజర్ ఫోన్ మెటాడేటాలో సేవ్ అవుతుంది, కానీ కాలర్ IP అడ్రస్‌ సేవ్ కాదు. దీంతో సైబర్ నేరగాళ్ల ఐపీ అడ్రస్‌ను గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారుతుంది. ఐపీ అడ్రస్‌ కావలసిన ప్రతిసారి వాట్సాప్‌ను అడగాల్సిన పరిస్థితి వస్తుంది, దీనికి చాలా సమయం పట్టవచ్చు. అమిత్ దూబే వంటి భారతదేశంలోని కొంతమంది పాపులర్ సైబర్ సెక్యూరిటీ నిపుణులు కూడా ఈ ఫీచర్‌ను రావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. టెలిగ్రామ్ వంటి ఇతర యాప్‌లలో ఇప్పటికే ఈ ఫీచర్ ఉందని, ఈ యాప్‌లను చాలా మంది సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్నారని నిపుణులు అంటున్నారు. వాట్సాప్ కొత్త ఫీచర్ వల్ల సైబర్ నేరాలు పెరుగుతాయని, వారిని పట్టుకోవడం పోలీసులకు కష్టమవుతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రైవసీ సమస్యలపై వాట్సాప్ సహకరించడం లేదని భారత ప్రభుత్వం చాలాసార్లు ఫిర్యాదు చేసిందని కూడా వారు ప్రస్తావించారు. మరో సైబర్ సెక్యూరిటీ నిపుణుడు సన్నీ నెహ్రా మాట్లాడుతూ, వాట్సాప్ కొత్త ఫీచర్ సైబర్ నేరస్థులను పట్టుకోవడం పోలీసులకు మరింత కష్టతరం చేస్తుందని అన్నారు. వాట్సాప్ కొత్త ఫీచర్ వాట్సాప్‌ను సైబర్ నేరగాళ్లు, ఉగ్రవాదులకు సురక్షితమైన ప్రదేశంగా మారుస్తుందని నిపుణులు హెచ్చరించారు. మరోవైపు ఈ కొత్త ఫీచర్ రిస్కుల గురించి వాట్సాప్ ఇంకా స్పందించలేదు.

Post a Comment

0 Comments

Close Menu