Ad Code

యూపీఐ ట్రాన్సాక్షన్లను 4 గంటల్లోపు రివర్స్ చేసే ఆప్షన్ ?


యూపీఐ రాకతో డిజిటల్‌ పేమెంట్‌ సర్వీసులు పెరిగాయి. గ్రామాల నుంచి నగరాల వరకు దాదాపు ప్రతి అవసరానికి యూపీఐ, ఆన్‌లైన్‌ పేమెంట్లు చేస్తున్నాయి. ఇదే సమయంలో సైబర్‌ మోసాల వలలో పడి ప్రజలు డబ్బు పోగొట్టుకుంటున్నారు. మోసపోయినట్లు గ్రహించి, పోలీసులకు కంప్లైంట్‌ చేసేలోపు, నిందితులను పట్టుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక మోసాలకు చెక్‌ పెట్టేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. డిజిటల్‌ పేమెంట్స్‌లో ట్రాన్సాక్షన్‌ చేసిన నాలుగు గంటల్లో రివర్స్ చేసే ఆప్షన్‌ ప్రవేశపెట్టాలని, డిజిటల్ పేమెంట్స్‌ భద్రతను పెంచాలని యోచిస్తోంది. ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ఈ విషయం గురించి తెలిపిన వివరాలను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించింది. IMPS, RTGS(రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్), UPI సహా రూ.2,000 కంటే ఎక్కువ డిజిటల్ ట్రాన్సాక్షన్లకు 4 గంటల పరిమితిని విధించే అవకాశం ఉందని రిపోర్ట్ పేర్కొంది. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో సంబంధిత అధికారి మాట్లాడుతూ.. 'డిజిటల్‌ ట్రాన్సాక్షన్లలో మొదటిసారి రూ.2,000 కంటే ఎక్కువ అమౌంట్‌ ఉన్న ట్రాన్సాక్షన్‌కి నాలుగు గంటల కాల పరిమితిని జోడించాలని చూస్తున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, గూగుల్, రేజర్‌పే వంటి టెక్ కంపెనీల సహా ప్రభుత్వం, పరిశ్రమ వాటాదారులతో మంగళవారం జరిగే సమావేశంలో ఈ చర్చ జరుగుతుంది.' అని చెప్పారు. ఇది ఎలా పని చేస్తుందంటే.. ఒకరికి పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్‌ని రివర్స్ చేయడానికి లేదా మాడిఫై చేయడానికి వినియోగదారులకు నాలుగు గంటల సమయం ఉంటుంది. ఇది కొన్ని గంటల్లో ట్రాన్సాక్షన్‌ జరిగే NEFT (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్) తరహాలో ఉంటుంది. తొలుత ట్రాన్సాక్షన్‌ రివర్స్‌ చేయడంలో అమౌంట్‌ లిమిట్‌ లేదని భావించారని తెలిసింది. అయితే పరిశ్రమతో అనధికారిక చర్చల ద్వారా, లిమిట్‌ ఉంచకపోతే, కిరాణా వంటి చిన్న-స్థాయి కొనుగోలుపై ప్రభావం చూపుతుందని నిర్ణయించారు. అందుకే రూ.2,000 లోపు ట్రాన్సాక్షన్లను రివర్స్‌ చేయడం నుంచి మినహాయించేందుకు సిద్ధమయ్యారు. ఈ 4-గంటల విండో కొత్త వినియోగదారుల కోసం UPI పేమెంట్స్‌లో కనిపించే ప్రస్తుత విధానం తరహాలోనే ఉంటుంది. ఒక యూజర్ కొత్త UPI అకౌంట్‌ క్రియేట్‌ చేసినప్పుడు, మొదటి 24 గంటల్లో రూ.5,000 వరకు మాత్రమే సెండ్‌ చేయగలరు. ఇదే సూత్రం NEFTకి వర్తిస్తుంది, ఇక్కడ బెనిఫిషియరీని యాక్టివేట్ చేసిన తర్వాత ప్రారంభ 24 గంటల్లో గరిష్టంగా రూ.50,000 ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu