Ad Code

రెండేండ్లుగా వినియోగించని జీ-మెయిల్ ఖాతాల తొలగింపు !

రెండేండ్లుగా వినియోగించని జీ-మెయిల్ ఖాతాలను తొలగిస్తామని గూగుల్ ప్రకటించింది. వచ్చేనెల నుంచి దశల వారీగా ఈ ప్రక్రియ ప్రారంభించనున్నది. తొలగింపునకు ముందు కొన్ని నెలల పాటు హెచ్చరికలతో కూడిన సందేశాలు పంపుతామని గత మే నెలలో గూగుల్ తన బ్లాగ్'లో రాసుకున్నది. వచ్చే నెల నుంచి దశల వారీగా జీ-మెయిల్ ఖాతాల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుడతామని వెల్లడించింది. అలా డిలిట్ అయ్యే జీ-మెయిల్ ఖాతాతోపాటు రికవరీ మెయిల్‌కు కూడా గత మే నెలలో గూగుల్ ఇచ్చిన సందేశం వర్తిస్తుంది. ఇప్పటికే డిలిట్ ముప్పు గల జీ-మెయిల్ అకౌంట్లకు ఇప్పటికే పలు హెచ్చరికల సందేశాలు వచ్చి ఉంటాయి. రెండేండ్లుగా లాగిన్ కాకుండా ఉన్న జీ-మెయిల్ అకౌంట్లతోపాటు వాటితో అనుసంధానమైన డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలండర్, ఫోటోస్‌లోని కంటెంట్ కూడా డిలిట్ అవుతుందని గూగుల్  తేల్చి చెప్పింది. అయితే కనీసం రెండేండ్లుగా నిరుపయోగంగా ఉన్న వ్యక్తిగత జీ-మెయిల్ అకౌంట్లు మాత్రమే డిలిట్ చేస్తామని పేర్కొన్నది. గూగుల్ తన బ్లాగ్'లో వెల్లడించినట్లు రెండేండ్లకోసారైనా జీ-మెయిల్ ఖాతాలో లాగిన్ కావాలి. గూగుల్ అకౌంట్, దానికి అనుసంధానమైన ఏ సేవనైనా రెండేండ్లలో ఒకసారి వాడుకోవాలి. గూగుల్ డ్రైవ్ వాడటంతోపాటు లాగ్ ఇన్ అయి యూ-ట్యూబ్'లో వీడియో చూసినా, గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్ లోడ్ చేసుకున్నా, గూగుల్ ఖాతా సాయంతో థర్డ్ పార్టీ యాప్ లాగిన్ అయినా.. మీ జీ-మెయిల్ ఖాతాకు ఢోకా లేనట్లే. ఇదిలా ఉంటే యూ-ట్యూబ్ వీడియోస్‌తో లింక్ చేసి ఉన్న అకౌంట్లు మాత్రం తొలగించబోమని గూగుల్ క్లారిటీ ఇచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu