Ad Code

ఓపెన్ ఏఐకి ఉద్యోగుల హెచ్చరిక !


'ఛాట్ జీపీీటీ'ని తయారు చేసిన ఓపెన్ ఏఐ కంపెనీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన సామ్ ఆల్ట్‌మాన్‌ను ఇటీవల సీఈవో జాబ్ నుంచి తొలగించారు. దీని ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. సామ్ ఆల్ట్‌మాన్‌ లాంటి అంకితభావం కలిగిన సీఈవోను తొలగించడాన్ని ఉద్యోగులంతా వ్యతిరేకిస్తున్నారు. ఓపెన్ ఏఐ కంపెనీ బోర్డులోని ప్రస్తుత సభ్యులందరూ రాజీనామా చేయకుంటే తామే ఉద్యోగాలు మానేస్తామని 500 మందికిపైగా ఉద్యోగులు అల్టిమేటం ఇచ్చారు. ఈమేరకు ఒక లేఖను కంపెనీ బోర్డుకు పంపించారు. ఒకవేళ ఉద్యోగాల నుంచి తీసేస్తే.. తమ మాజీ బాస్‌తో కలిసి మైక్రోసాఫ్ట్‌లో చేరిపోతామని వార్నింగ్ ఇచ్చారు. ''మీరు ఇంతకుముందు గ్రెగ్ బ్రాక్‌మన్‌ను కంపెనీ నుంచి తొలగించారు. ఇప్పుడు సామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించారు. మీ నిర్ణయాలన్నీ కంపెనీ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టాయి. ఓపెన్ ఏఐని పర్యవేక్షించే సామర్థ్యం మీకు లేదని దీన్నిబట్టి అర్థమవుతోంది. మీరు తప్పుకుంటేనే మేం ఉద్యోగాల్లో కొనసాగుతాం'' అని పేర్కొంటూ ఒక వార్నింగ్ లెటర్‌ను ఓపెన్ ఏఐ కంపెనీ బోర్డుకు 505 మంది ఉద్యోగులు పంపారు. సామ్ ఆల్ట్‌మాన్‌ను సీఈవో పోస్టు నుంచి తొలగించిన తర్వాత ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా నియమితులైన మీరా మురాటి, చీఫ్ డేటా సైంటిస్ట్ ఇలియా సట్స్‌కేవర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బ్రాడ్ లైట్‌క్యాప్‌కు కూడా ఓపెన్ ఏఐ ఉద్యోగులు ఈలేఖను పంపారు. వారిని కూడా ఆయా హోదాల నుంచి తప్పుకోవాలని కోరారు. ఓపెన్ ఏఐలో దాదాపు 700 మంది ఉద్యోగులు ఉండగా వారిలో 505 మంది వెళ్లిపోతామని వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. మరోవైపు సామ్ ఆల్ట్‌మాన్‌కు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జాబ్ ఆఫర్ ఇచ్చారు. గతంలో ఓపెన్ ఏఐలో సామ్ ఆల్ట్‌మాన్‌తో కలిసి పనిచేసిన గ్రెగ్ బ్రాక్‌మన్‌ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఏఐ రీసెర్చ్ టీమ్‌ను లీడ్ చేస్తున్నారు. గ్రెగ్ బ్రాక్‌మన్‌తో కలిసి మైక్రోసాఫ్ట్ ఏఐ రీసెర్చ్ టీమ్‌ను ముందుకు తీసుకెళ్లాలని సామ్‌ను కోరారు. దీంతో మైక్రోసాఫ్ట్ ఏఐ టీమ్‌లో సామ్ ఆల్ట్‌మాన్‌ చేరిపోయారు.

Post a Comment

0 Comments

Close Menu