Ad Code

అమెజాన్‌లో హ్యుందాయ్‌ కార్ల విక్రయం !


మెజాన్ ద్వారా హ్యుందాయ్‌ వాహనాలను కొనుగోలు చేయవచ్చని హ్యుందాయ్‌, అమెజాన్‌ సంయుక్త ప్రకటన చేశాయి. కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంది. అమెజాన్‌, హ్యుందాయ్‌ల మధ్య డిజిటల్‌ షోరూం ఒప్పందం రెండు సంవత్సరాల ముందు కుదిరినట్లు తెలుస్తోంది. దీని ద్వారా అమెజాన్‌ వినియోగదారులు హ్యుందాయ్‌ కార్ల ధర సహా ఇతర స్పెసిఫికేషన్ల వివరాలు మరియు సమీపంలోని డీలర్‌ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. తర్వాత జెనరేషన్‌ వాహనాలు అలెక్సాను కూడా సపోర్టు చేస్తాయని తెలుస్తోంది. అమెజాన్‌, హ్యుందాయ్‌ల తాజా నిర్ణయం వినియోగదారుల అనుభవాలను మెరుగుపరిచేందుకు, వ్యాపార కార్యకలాపాల శైలిని మార్చడంలో ఉపయోగపడతాయని అమెజాన్‌ సీఈవో అండీ జాస్సి ఎక్స్ (ట్విట్టర్‌) ద్వారా వెల్లడించారు. ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్‌ తన మొదటి డిజిటల్‌ షోరూంను 2018 సంవత్సరంలో అమెజాన్‌లో ప్రారంభానికి తొలి అడుగులు పడినట్లు తెలుస్తోంది. లాస్‌ ఏంజిల్స్‌ ఆటోషోలో తాజా నిర్ణయాన్ని ప్రకటన చేసింది. దీంతోపాటు మరో కీలక ప్రకటన చేసింది. అమెజాన్‌- హ్యుందాయ్‌ ఒప్పందంలో భాగంగా 2025 సంవత్సరంలో హ్యుందాయ్‌ వాహనాల కొనుగోలు దారులు తమ కార్లలో అమెజాన్‌ అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌ యాక్సెస్‌ చేసేందుకు వీలు కల్పిస్తుందని తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద కస్టమర్‌ సెంట్రిక్ సంస్థల్లో ఒకదానితో ఒప్పందం చేసుకోవడం ద్వారా పోర్ట్‌ఫోలియాను విస్తరించడం, సేల్స్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, ఎలక్ట్రిక్‌ వాహనాలను వైపు తమ లక్ష్యాన్ని మళ్లించడం సహా స్మార్ట్‌ మొబిలిటీ వంటి అద్భుతమైన అవకాశాలను పొందవచ్చని హ్యుందాయ్‌ మోటార్స్‌ సీఈవో జే చాంగ్ వెల్లడించారు. అమెజాన్‌ కార్‌ సేల్స్‌ సెక్షన్‌లో మోడల్‌, ట్రిమ్‌, కలర్‌, ఫీచర్‌లతో సహా ఇతర ప్రాధాన్యతల ఆధారంగా వారి ప్రాంతాల్లో డెలివరీ తీసుకొనే విధంగా కొనుగోలు చేయవచ్చు. ఇష్టమైన కారును ఎంచుకొని, తక్షణ చెల్లింపు లేదా ఫైనాన్సింగ్‌ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లోనే వాహనం కొనుగోలు చేసి, డెలివరీ పొందవచ్చు లేదా స్థానిక డీలర్‌షిప్‌ ద్వారా డెలివరీని కోరవచ్చని అమెజాన్‌ తెలిపింది. ఇప్పటికే అమెజాన్‌ కార్లు సహా ఇతర వాహనాలకు సంబంధించి కొన్ని రకాల ఉపకరణాలను (స్పేర్‌పార్ట్స్‌)ను విక్రయిస్తోంది. మరియు అమెజాన్‌ వెహికల్‌ షోరూం సైట్‌ను నిర్వహిస్తోంది. దీంతోపాటు కార్లకు సంబంధించిన వివిధ రకాల ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది.


Post a Comment

0 Comments

Close Menu