Ad Code

టెస్లా కోసం పాలసీ మార్చొద్దు !


దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మేకిన్‌ ఇండియా పాలసీ నిలకడగా ఉండాలని, ఏ ఒక్క సంస్థ కోసమో దాన్ని మార్చేయరాదని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఈవీ కమిటీ చైర్‌పర్సన్‌ సులజ్జా ఫిరోదియా మోత్వానీ వ్యాఖ్యానించారు. భారత్‌లో విద్యుత్‌ కార్ల తయారీ ఇన్వెస్ట్‌ చేయాలంటే కొన్నాళ్ల పాటు తమ వాహనాల దిగుమతి సుంకాలను తగ్గించాలంటూ అమెరికన్‌ సంస్థ టెస్లా.. కేంద్రానికి ప్రతిపాదించిన నేపథ్యంలో మోత్వానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'ఎవరో దేశీయంగా తయారీపై ఇన్వెస్ట్‌ చేస్తామన్నంత మాత్రాన .. ప్రభుత్వం అమలు చేస్తున్న మేకిన్‌ ఇండియా విధానాలను మార్చడం సరికాదు. ఒక విధానం ఉందని, దాన్ని పాటించాల్సిందేనని అందరూ గుర్తెరగాలి. టెస్లా సమర్పించిన ప్రతిపాదన గురించి నాకు పూర్తిగా తెలియదు. కానీ పాలసీ విషయంలో గందరగోళం ఉండకూడదని, నిలకడగా ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం' అని ఆమె వివరించారు. భారత్‌ కచ్చితంగా మేకిన్‌ ఇండియాపై దృష్టి పెట్టినప్పుడే దీర్ఘకాలికంగా పోటీతత్వం పెరగగలదని పేర్కొన్నారు. అలా జరగకపోతే ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కోసం విడిభాగాలన్నింటినీ దిగుమతే చేసుకోవాల్సి వస్తుందన్నారు. మరోవైపు, వ్యక్తిగత అవసరాలకు కొనుగోలు చేసే చిన్న ఎలక్ట్రిక్‌ కార్లకు కూడా ఫేమ్‌ స్కీమును (విద్యుత్‌ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు సబ్సిడీలిచ్చే పథకం) వర్తింపచేయాలని కేంద్రాన్ని కోరినట్లు మోత్వానీ తెలిపారు. రూ. 20 లక్షల వరకు ఖరీదు చేసే కార్లకు దీన్ని వర్తింపచేసే అంశాన్ని పరిశీలించాలని ఫేమ్‌ మూడో విడతపై ఫిక్కీ సమరి్పంచిన సిఫార్సుల్లో పేర్కొన్నట్లు ఆమె వివరించారు. ప్రస్తుతం వ్యక్తిగత ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు, ప్రభుత్వ.. వాణిజ్య రవాణా అవసరాలకు ఉపయోగించే త్రిచక్ర వాహనాలు, ఫోర్‌ వీలర్లు, ఎలక్ట్రిక బస్సులకు ఫేమ్‌ స్కీము వర్తిస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu