Ad Code

స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రాకెట్‌తో మరిన్ని ప్రయోగాలు !


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ త్వరలో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. ఇస్రో  వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్టు కేంద్రం తెలిపింది. 2024లో ముఖ్యమైన ప్రయోగాల విషయంలో కేంద్రం రాజ్యసభకు పలు వివరాలు వెల్లడించింది. సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 2024లో ఇస్రో చేపట్టే మొత్తం ప్రయోగాలు -10, PSLV ద్వారా చేపట్టే ప్రయోగాలు -6. GSLV ద్వారా ప్రయోగాలు -3, లాంచ్ వెహికల్ మార్క్-3 మిషన్ ప్రయోగం -1 మొత్తం కలిపి వచ్చే ఏడాది ఇస్రో 10 ప్రయోగాలు చేపట్టబోతున్నట్టు కేంద్రం తెలిపింది. ఇస్రో 2024లో PSLV ద్వారా నింగిలోకి పంపాలని అనుకుంటున్న 6 ఉపగ్రహాల్లో అన్నిరకాల శాటిలైట్లు ఉన్నాయి. అంతరిక్ష పరిశోధన, భూ పరిశీలన ఉపగ్రహాలు, సాంకేతిక అభివృద్ధికి ఉపయోగపడే 2 ఉపగ్రహాలు, 2 వాణిజ్య ఉపగ్రహాలు ఇందులో ఉన్నాయి. ఇక GSLV ద్వారా ఇస్రో 3 ప్రయోగాలు చేపట్టాలనుకుంటోంది. వాతావరణ శాస్త్ర ఉపగ్రహం, నేవిగేషన్ శాటిలైట్, నాసా- ఇస్రో సంయుక్త ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న సింథటిక్ అపెర్చర్ రేడార్ ఉపగ్రహాలను GSLV ద్వారా నింగిలోకి పంపించబోతు్నారు. వీటితోపాటు పునర్వినియోగ వాహక నౌక ప్రయోగాలను కూడా ఇస్రో చేపట్టబోతోంది. రెండు పునర్వినియోగ వాహక నౌకలతో వచ్చే ఏడాది ప్రయోగాలు చేస్తుంది ఇస్రో. ఇక జిశాట్ 20 ఉపగ్రహాన్ని కూడా ఇస్రో వచ్చే కక్ష్యలో ప్రవేశపెడుతుంది. ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో అతి ఎక్కువ విజయశాతం ఉన్నవి PSLV ప్రయోగాలు. PSLV ఇస్రోకు నమ్మినబంటు. PSLV, GSLV తోపాటు.. తక్కువ ఎత్తులో ఉన్న కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రవేశ పెట్టేందుకు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV)ని కూడా ఇస్రో రూపొందించింది. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన రెండు ప్రయోగాలు జరిగాయి. అందులో ఒకటి విఫలం కాగా, మరొకటి విజయం సాధించింది. 2022 ఆగస్ట్ 7న రెండు పేలోడ్ లతో SSLV నింగిలోకి ఎగిరింది. అయితే ఆ ప్రయోగం విఫలమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 10న మూడు పేలోడ్ లను ప్రయోగించగా SSLV సక్సెస్ అయింది. వచ్చే ఏడాదిలో SSLV నుంచి మరిన్ని ప్రయోగాలు చేపట్టనున్నట్టు కేంద్రం తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu