Ad Code

డీప్‌ఫేక్స్‌పై సోషల్ మీడియా కంపెనీలకు కేంద్రం అడ్వైజరీ !


డీప్‌ఫేక్‌ సమస్యకు చెక్ పెట్టే చర్యలపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టింది. సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్‌ కంటెంట్‌ను నియంత్రించే లక్ష్యంతో కొన్ని సూచనలు జారీ చేసింది. ఐటీ నిబంధనలను సంబంధిత కంపెనీలు కచ్చితంగా ఫాలో అవ్వాలని స్పష్టం చేసింది. ఇటీవల వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ప్రముఖ సినీతారలు, రాజకీయ నాయకుల డీప్‌ఫేక్‌ వీడియోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నవంబర్ 22, 23 తేదీల్లో టెక్నాలజీ కంపెనీలతో విస్తృతంగా చర్చించారు. ఈ క్రమంలో తాజాగా కొన్ని సూచనలు జారీ చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌ కోడ్‌) రూల్స్, 2021 కింద అనుమతి లేని కంటెంట్‌ గురించి ఆయా టెక్‌ కంపెనీలు వినియోగదారులకు స్పష్టంగా కమ్యూనికేట్ చేయాలి. రూల్ 3(1)(బి) కింద ఈ కంటెంట్‌ను లిస్టు చేశారు. ఏదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో యూజర్లు ఇనీషియల్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్న సమయంలోనే నిషేధిత కంటెంట్ గురించి తెలియజేయాలి. పరిమితులకు సంబంధించి రెగ్యులర్ రిమైండర్లు తప్పనిసరిగా అందించాలి. ముఖ్యంగా లాగిన్ అయిన ప్రతి సందర్భంలో ప్లాట్‌ఫామ్‌లో ఇన్‌ఫర్మేషన్‌ అప్‌లోడ్ చేసేటప్పుడు లేదా షేర్‌ చేస్తున్నప్పుడు రిమైండ్‌ చేయాలి. మెటా కంపెనీకి చెందిన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, గూగుల్‌ కంపెనీకి చెందిన యూట్యూబ్, ఇతర ప్రధాన సోషల్ మీడియా కంపెనీలకు ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. డీప్‌ఫేక్ కంటెంట్‌ను ఉద్దేశపూర్వకంగా క్రియేట్‌ చేస్తే ఎదుర్కొనే పెనాల్టీల గురించి వినియోగదారులకు తెలియజేయాలని పేర్కొంది. రూల్ 3(1)(బి)ని ఉల్లంఘించిన సందర్భంలో భారతీయ శిక్షాస్మృతి 1860, IT చట్టం, 2000, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం ఎదుర్కొనే చట్టపరమైన చర్యలు గురించి వినియోగదారులు పూర్తిగా తెలుసుకోవాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌ కోడ్‌) రూల్స్, 2021లోని రూల్ 3(1)(బి)(వీ) ఇప్పటికే డీప్‌ఫేక్‌లను స్పష్టంగా ప్రస్తావించింది. ఈ నియమం మధ్యవర్తులను మోసగించే లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని హోస్ట్ చేయడం, డిస్‌ప్లే చేయడం, అప్‌లోడ్ చేయడం, మాడిఫై చేయడం, పబ్లిష్‌ చేయడం, ఇతరులకు ట్రాన్స్‌ఫర్‌ చేయడం, స్టోర్‌ చేయడం, అప్‌డేట్‌ చేయడం లేదా షేర్‌ చేయడం నిషేధిస్తుంది. కొత్త అడ్వైజరీ జారీ చేయడమంటే కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడం కాదని, డీప్‌ఫేక్‌లపై ఇప్పటికే ఉన్న చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌కు కట్టుబడి ఉండాలని సంస్థలకు గట్టిగా సూచించడమని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిషేధిత కంటెంట్ గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడం, నిబంధనలు తెలియజేయడం వంటి క్రియాశీల చర్యలను అనుసరించడానికి ప్లాట్‌ఫారమ్‌లను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ సూచనల అమలును పర్యవేక్షించాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ప్లాట్‌ఫారమ్‌లు రూల్స్ పాటించడంలో విఫలమైతే, అమలును మెరుగుపరచడానికి, ఏదైనా అస్పష్టతను తొలగించడానికి నిబంధనలను సవరించే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu