Ad Code

గూగుల్ ఉద్యోగులకు రానున్నది గడ్డుకాలం ?


గూగుల్ సంస్థకి ప్రపంచ వ్యాప్తంగా 70 కార్యాలయాలు ఉన్నాయి. రెండు లక్షలకు పైగా ఉద్యోగస్తులు పని చేస్తున్నారు. ఏడాదికి 200 లక్షల కోట్ల టర్నోవర్ కలిగిన అతి పెద్ద సంస్థగా వెలుగొందుతోంది. ఇందులో ఉద్యోగం వచ్చిందంటే వారి జీవితం గాడిన పడ్డట్టే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇందులో ఎలాగైనా ఉద్యోగం సాధించాలని కలలు కంటూ ఉంటారు. అయితే ఇందులో ఉన్న ఉద్యోగులకు చేదు వార్తను వెల్లడించింది ఈ సంస్థ. ప్రస్తుత పరిస్థితులల్లో చిన్నా చితకా స్టార్టప్ కంపెనీలు దివాళా తీస్తున్నాయంటే అర్థం ఉంది. అందులోని ఉద్యోగులను తొలగిస్తే పరిస్థితి బాగలేదు అనుకోవచ్చు. ఉద్యోగులకు ఉద్వాసన పలికే చర్యలకు గూగుల్ పాల్పడటం ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. నేడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రపంచం మొత్తం నడుస్తోంది. ఇది కొన్ని దశాబ్ధాల క్రితం నుంచి ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో బహు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇదే ఇప్పుడు గూగుల్ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. తమ ఉద్యోగాల ఊచకోతకు కారణమవుతోంది. ఏఐ టెక్నాలజీ అభివృద్ది చెందే కొద్దీ ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్థంగా మారుతుందని టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు గతంలో చాలా సార్లు తెలిపారు. ఆ మాట ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది. తాజాగా గూగుల్ యాడ్స్ సేల్స్ యూనిట్ విభాగంలో గూగుల్ సంస్థ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఏఐ ఆధారిత ఆటోమెటిక్ డిజైన్ టూల్ ను వినియోగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీని ఫలితంగా మనుషులతో చేసే పనిని కృత్రిమ మేధను ఉపయోగించి చేయడంతో యాడ్స్ డిజైన్ చేసే వారికిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గూగుల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం ఆ సంస్థ ఆర్థికంగా మరింత బలపడటానికే అంటున్నారు టెక్ నిపుణులు. ఇలా యాడ్ డిజైన్స్ చేసే వారి స్థానంలో ఏఐ టెక్నాలజీ ఉపయోగించుకుంటే మిలియన్ల కొద్ది డబ్బులు ఆదా అవుతాయని ఆలోచిస్తోంది. తద్వారా భారీ లాభాలను గణించవచ్చని అభిప్రాయపడుతోంది. ఇటీవల నిర్వహించిన గూగుల్ యాడ్స్ మీటింగ్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. గూగుల్ యాడ్ ఉద్యోగుల స్థానంలో ఏఐ ఆధారిత సాంకేతికతను తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ విభాగంలో పనిచేసే 30 వేల మందిపై తీవ్ర ప్రభావం పడనుంది. వీరు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉంది అంటున్నారు సాంకేతిక నిపుణులు.

Post a Comment

0 Comments

Close Menu