Ad Code

పాస్‌వర్డ్ మేనేజర్స్‌ వల్ల ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు పెద్ద ముప్పు ?


స్మార్ట్‌ఫోన్ మ్యానుఫ్యాక్చరర్లతో పాటు, వెబ్ బ్రౌజర్లు యూజర్లకు పాస్‌వర్డ్ మేనేజర్స్‌ను ఇన్-బిల్ట్ అప్లికేషన్‌గా ఆఫర్ చేస్తాయి. ఈ పాస్‌వర్డ్ మేనేజర్స్‌ యాప్స్ అకౌంట్ల పాస్‌వర్డ్‌లను స్టోర్ చేయడంతో పాటు వెబ్‌సైట్స్‌, యాప్స్‌లో లాగిన్ అయ్యే సమయంలో వాటిని ఆటోమేటిక్‌గా ఫిల్ చేస్తాయి. అయితే వీటివల్ల ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు పెద్ద ముప్పు ఏర్పడింది. ఈ యాప్‌లలో ఓ పెద్ద సెక్యూరిటీ ప్రాబ్లమ్‌ తాజాగా బయటపడింది. హ్యాకర్లు ఈ లూప్‌హోల్ సద్వినియోగం చేసుకుని పాస్‌వర్డ్‌లను సింపుల్‌గా తస్కరించగలరు. ఈ తీవ్రమైన సమస్యను భారతదేశంలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ పరిశోధకులు కనుగొన్నారు. యూరప్‌లో జరిగిన బ్లాక్ హాట్ కాన్ఫరెన్స్‌లో దీని గురించి ఓ నివేదికను సమర్పించారు. ఈ భద్రతా సమస్యను 'ఆటోస్పిల్' అని పిలుస్తారు. ఈ ప్రాబ్లమ్‌ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆటోఫిల్ పాస్‌వర్డ్ ఫీచర్‌ను ప్రభావితం చేస్తుంది. ఆటోఫిల్ ఫీచర్‌తో వెబ్ బ్రౌజర్‌ను తెరవకుండానే వెబ్ పేజీలలో పాస్‌వర్డ్‌లను ఆటోమేటిక్‌గా ఫిల్ చేయవచ్చు. ఈ ఫీచర్‌ను లాంచ్ చేయడానికి గూగుల్ వెబ్‌వ్యూపేజీని ఉపయోగిస్తుంది. దీనిలోని భద్రతా సమస్య వల్ల ఏ యాప్‌ పాస్‌వర్డ్‌ను అభ్యర్థిస్తుందో పాస్‌వర్డ్ మేనేజర్ తెలుసుకోలేకపోతోంది. యూజర్లకు కూడా తెలియజేయడం లేదు. ఉదాహరణకు బ్యాంక్ యాప్ పాస్‌వర్డ్స్‌ను వేరే యాప్‌లో ఆటోఫిల్ చేయవచ్చు. దీని ద్వారా యూజర్‌కు తెలియకుండానే సున్నితమైన బ్యాంకు పాస్‌వర్డ్‌లను హానికరమైన యాప్‌ తెలుసుకోగలదు. ఈ తీవ్రమైన భద్రతా సమస్య 1పాస్‌వర్డ్, లాస్ట్‌పాస్, కీపర్, ఎన్‌పాస్ వంటి ప్రముఖ పాస్‌వర్డ్ మేనేజర్‌లలో కనిపించిందని పరిశోధకులు కనుగొన్నారు. రీసెర్చర్లు లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో ఈ యాప్‌లను ఆండ్రాయిడ్ ఫోన్‌లలో పరీక్షించారు. గూగుల్, యాప్ డెవలపర్లకు సమస్య గురించి తెలియజేశారు. ప్రస్తుతం డెవలపర్స్ ఈ సమస్యను ఫిక్స్ చేసే పనిలో పడ్డారు. ఈ సమస్యకు పరిష్కారంతో త్వరలోనే అప్డేట్ రావచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు పాస్‌వర్డ్ మేనేజర్లను అప్‌డేట్ చేస్తూ ఉండాలి. అప్పటిదాకా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆటోఫిల్ పాస్‌వర్డ్ ఫీచర్‌ను ఉపయోగించడం పట్ల జాగ్రత్తగా ఉండాలని యూజర్లను హెచ్చరిస్తున్నారు. ఆటోఫిల్ పాస్‌వర్డ్ ఎంట్రీకి బదులుగా మాన్యువల్ ఎంట్రీ ఆప్షన్ ఎన్నుకోవడం మంచిది. తరచుగా ఉపయోగించని లేదా నమ్మకం లేని యాప్‌లకు ఆటోఫిల్ ఫీచర్‌ను డిసేబుల్ చేయాలి. తద్వారా తప్పు యాప్‌లో అనుకోకుండా ఆటోఫిల్ అయ్యే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu