Ad Code

విద్యుత్‌ వాహనాల సబ్సిడీలో మహిళలకు అదనపు రాయితీ ?


విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ రెండు దశలకు కొనసాగింపుగా ఫేమ్‌-3ని తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తీసుకురాదలచిన ఈ పథకానికి రూ.26,400 కోట్లు కేటాయించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ప్రతిపాదించింది. భాగస్వామ్య పక్షాలతో చర్చల అనంతరం ఈ ప్రతిపాదన చేసినట్లు 'బిజినెస్‌ స్టాండర్డ్‌' తన కథనంలో పేర్కొంది. ఫేమ్‌-1కు కొనసాగింపుగా ఫేమ్‌-2 సబ్సిడీ పథకాన్ని 2019 ఏప్రిల్‌ 1న కేంద్రం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా టూవీలర్‌, త్రీవీలర్‌, ఫోర్‌ వీలర్‌ కొనుగోళ్లపై సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకం 2024 మార్చి 31తో ముగియనుంది. అయితే, రెండు దశల్లో దీనిని తీసుకొచ్చిన నేపథ్యంలో మూడో దశ అవసరాన్ని ఆర్థిక శాఖ ప్రశ్నించింది. ప్రత్యామ్నయ ఇంధనం వైపు ప్రజలను మళ్లించాలంటే దీని కొనసాగింపు అవసరమని భారీ పరిశ్రమల శాఖ పట్టుబడుతోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ టూవీలర్ల కోసం రూ.8,158 కోట్లు, ఈ- బస్సుల కొనుగోళ్లపై రూ.9600 కోట్లు, ఎలక్ట్రిక్‌ త్రీవీలర్ల కోసం రూ.4,100 కోట్లు సబ్సిడీ రూపంలో ఇవ్వాలని భారీ పరిశ్రమల శాఖ ప్రతిపాదిస్తోంది. ఎలక్ట్రిక్‌ ఫోర్‌ వీలర్ల కోసం మరో రూ.1800 కోట్లతో పాటు తొలిసారి ఈ-ట్రాక్టర్లను, హైబ్రిడ్‌ వాహనాలను ఈ పథకం పరిధిలోకి చేర్చాలని భావిస్తోంది. ఇందుకోసం రూ.300 కోట్లు కేటాయించాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. గతంలో మాదిరి కాకుండా ఎలక్ట్రిక్‌ టూవీలర్లకు ఇచ్చే సబ్సిడీ తగ్గిస్తూ వెళ్లాలన్నది భారీ పరిశ్రమల శాఖ ప్రతిపాదన. కిలోవాట్‌ బ్యాటరీకి తొలి ఏడాది రూ.15వేలు, మరుసటి ఏడాది రూ.7,500, ఆ తర్వాత వరుసగా రెండేళ్లు సబ్సిడీ మొత్తాన్ని రూ.3 వేలు, రూ.1500కు కుదించాలని యోచిస్తోంది. ఒక్కో టూవీలర్‌కు అత్యధికంగా చెల్లించే సబ్సిడీని సైతం రూ.15వేలకు పరిమితం చేయాలన్న ప్రతిపాదన ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫోర్‌ వీలర్‌, త్రీవీలర్‌ విషయంలోనూ ఇదే పద్ధతిని అనుసరించాలని భావిస్తోంది. అదే విధంగా మహిళల పేరిట రిజిస్టర్‌ చేసే ఏ వాహనానికైనా 10 శాతం చొప్పున అదనపు సబ్సిడీ ఇవ్వాలన్నది ఈ ప్రతిపాదనల్లో మరో ముఖ్య అంశం. కొనుగోళ్లపై రాయితీతో పాటు టెక్నాలజీ డెవలప్‌మెంట్‌, ట్రయల్‌ రన్‌ వర్క్స్‌ కోసం ఈ పథకంలో భాగంగానే నిధులు కేటాయించాలన్నది కేంద్రం ఆలోచన. మొత్తంగా రూ.33వేల కోట్లను మూడో దశకు కేటాయించే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu