అత్యంత శక్తిమంతమైన సౌర తుఫాన్ తాజాగా భూమిని తాకింది. గడిచిన ఆరేళ్లలో ఇంత బలమైన సౌర తుఫాన్ భూమిని తాకడం ఇదే తొలిసారి. ఈ తుఫాన్ ఫలితంగా భూ అయస్కాంత క్షేత్రంలో తీవ్ర అవరోధాలు తలెత్తాయని అమెరికా వాతావరణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ సౌర తుఫాన్ చుట్టూ ఉన్న పరిస్థితులు బలహీనపడుతున్నాయని, తుఫాన్ మాత్రం ఒక మోస్తరు స్థాయిలో కొనసాగుతోందని వెల్లడించింది. ఈ సౌర జ్వాల వల్ల భూమిపై కొన్నిచోట్ల హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు విఘాతం కలుగొచ్చని అమెరికా వాతావరణ సంస్థ అధికారులు చెప్పారు. సుదూరంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లతో సంబంధాలను సాగించడానికి విమానాలు ఈ తరంగాలనే ఉపయోగిస్తుంటాయి. అయితే లోహ విహంగాల్లో చాలావరకు ఉపగ్రహ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తుంటారు. ఈ సౌర తుఫాన్ వల్ల శాటిలైట్ సేవల సంస్థలు తమ ఉపగ్రహాల గమనాన్ని నిశితంగా పరిశీలించడం కష్టమయ్యే ప్రమాదం ఉంది. పవర్ గ్రిడ్లకు ఇబ్బందులు కలుగవచ్చు. ధ్రువ ప్రాంతాల్లో వర్ణరంజితమైన ఆరోరాలు కూడా ఏర్పడతాయని పరిశోధకులు చెబుతున్నారు. 11 ఏళ్లకు ఒకసారి సూర్యుడి అయస్కాంత తీరుతెన్నులు మారిపోతుంటాయి. ఈ కాలచక్రానికి అనుగుణంగా సౌర చర్యలు కూడా మార్పులకు లోనవుతుంటాయి. ప్రస్తుతం సౌర చర్యలు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ దశను ‘సోలార్ మ్యాగ్జిమం’గా పేర్కొంటారు. ఈ కాలంలో భూ అయస్కాంత తుఫాన్‌లు ఉత్పన్నమవుతుంటాయి.
0 Comments