ఇది చాలా ఖరీదైన వ్యవహారంగా భావిస్తుంటారు. అయితే ఈ బార్‌కోడ్స్‌ను నేడు ప్రతి చోటా, ప్రతి వస్తువుపై తయారీదార్లు వినియోగిస్తున్నారు. దీనివల్ల ఆ వస్తువు నాణ్యతను దానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని అందులో పొందుపరచటం జరుగుతుంది. అంతేగాక, ఈ బార్‌కోడ్స్ ద్వారా ఆ ప్రొడక్ట్ ఖరీదును తెల్సుకోవటం ద్వారా సులభంగా డెలివరీ చేయవచ్చు. ఉదాహరణకు మీరు కిరాణాషాపులో ఒక వందకు పైగా సామాను ఖరీదు చేశారు. ప్రతి వస్తువుపైన ఖరీదు ఎక్కడో చూసి బిల్లు వేయటానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల అటు వినియోగదారుడికి, ఇటు షాపు యజమానికి విలువైన కాలహరణం జరుగుతుంది. ఈ డిజిటల్ బార్‌కోడ్స్ వచ్చాక వ్యాపార రంగంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
తొలిసారిగా ఈ బార్‌కోడ్‌ను 1948లోనే అభివృద్ధి చేయటం జరిగింది. ఇద్దరు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ టెక్నాలజీని సృష్టించటం జరిగింది. అమెరికాలోని డ్రెక్సల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డిగ్రీ చదువుతున్న బెర్నాడ్ సిల్వర్, నార్మన్ జోసెఫ్ వుడ్‌లాండ్ సంయుక్తంగా ఈ బార్‌కోడ్ టెక్నాలజీని కనిపెట్టారు. వీరు దీనిపై 1949లో పేటెంట్‌కు దరఖాస్తు చేయగా, 1952లో బార్‌కోడ్‌లపై వీరికి పేటెంట్ లభించింది. అయితే 1966లో ఈ బార్‌కోడ్స్ టెక్నాలజీ వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించగా, ప్రపంచవ్యాప్తంగా 1980ల నాటికి వీటి ఉపయోగం తెలిసి, భారీగా వినియోగం పెరిగింది. ప్రత్యేకించి తర్వాత కాలంలో ఈ బార్‌కోడ్‌ల విషయంలో అల్టాబెటికల్ విధానం, లేజర్ టెక్నాలజీని సంయుక్తంగా కలపటం ద్వారా ఈ టెక్నాలజీని ఇంకా అభివృద్ధి చేయటం జరిగింది. తొలినాళ్లలో ఆస్కీ విధానం, తర్వాత 2డి బార్‌కోడ్ విధానం వాడుకలో వచ్చాయి.
ఇరవై శతాబ్ధంలో టెక్నాలజీ తెచ్చిన పెద్ద మార్పుల్లో ఈ బార్‌కోడ్‌లను కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. షాపింగ్‌లో వినియోగదారులు కొనుగోలు చేసే ప్రొడక్ట్‌పై ఉండే ఈ బార్‌కోడ్‌లు వారి కంటికి అంతగా ఆనకపోయినా, వీటి రూపకల్పన వల్ల ఎంతో మేలు జరిగింది. ఈ టెక్నాలజీ అన్నిరంగాల్లోకి వేగంగా చొచ్చుకుపోయింది. ప్రత్యేకించి సాఫ్ట్‌వేర్ రంగం మరింతగా అభివృద్ధి జరిగిన తర్వాత ఈ బార్‌కోడ్స్ టెక్నాలజీని మానవ జీవితంలోకి ఎంతో వేగంగా చొచ్చుకు వచ్చింది. ఉద్యోగులు ఆఫీసులకు ఎన్నిగంటలకు వచ్చారో, వెళ్లారో, ఇతరులు ఎవరైనా ఆఫీసులోకి వస్తే వారికి గుర్తింపుగా ఈ బార్‌కోడ్ టెక్నాలజీ ఆధారిత కార్డులను ఇవ్వటం నేడు పెరిగిపోయింది. అంతేగాక డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ వచ్చిన తర్వాత దీని వినియోగం భారీగా పెరిగిందని చెప్పవచ్చును.
ఉదాహరణకు గతంలో విమానంలో లగేజి చాలా వరకు మారిపోవటమో, అసలు చేరాల్సిన లక్ష్యానికి చేరకపోవటమో జరిగేది. కానీ, ఈ టెక్నాలజీ ద్వారా ప్రతి లగేజికి బార్‌కోడ్ ట్యాగ్స్ ఏర్పాటు చేయటం ద్వారా అవి చేరాల్సిన ప్రదేశం చేరిన తర్వాత ట్యాగ్‌లను చెకర్స్ ద్వారా చెక్ చేయటం ద్వారా అవి చేరాయని పంపిన వారికి సమాచారం వస్తుంది. దీని ద్వారా ఒకేచోట నుంచి అన్ని రకాలైన పనులను చెక్ చేయటం సులభతరమైతుంది. ఈ టెక్నాలజీ ఫలితంగా ఫ్యాక్టరీల్లో, ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లో డిజిటల్ టెక్నాలజీ విప్లవం ప్రవేశించిందని చెప్పవచ్చు.
యూనివర్శల్ ప్రొడక్ట్ కోడ్ (యుపిసి) ...
1970 దశకంలో అంతర్జాతీయ బార్‌కోడ్ ఏర్పడింది. యూనివర్శల్ ప్రొడక్ట్ కోడ్‌గా ఏప్రిల్1, 1973లో దీన్ని ఐబిఎమ్ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు.అప్పట్లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏ, బి, సి, డి, ఇ అక్షర క్రమంతో దీన్ని రూపొందించటం జరిగింది. అయితే తొలినాళ్లలో దీన్ని సూపర్‌మార్కెట్‌లో ప్రవేశపెట్టినప్పడు స్కానర్ విఫలం అవటంతో కొద్ది సంవత్సరాల పాటు ఈ టెక్నాలజీ స్తబ్దుగా ఉండిపోయింది. అయితే దీన్ని సవాలుగా తీసుకొన్న ఐబిఎమ్‌కు చెందిన హెర్డ్ బ్రూమిస్టర్, బిల్ గ్రోస్, జార్జి లూరెర్, ప్రత్యేకంగా పరిశోధనలు చేసి సరికొత్త యూనివర్శల్ ప్రొడక్ట్ కోడ్ లేబుల్‌ను రూపొందించారు. గతంలో రూపొందించిన వృత్తాకారపు గీతలు, అడ్డగీతల స్థానంలో నూతన బార్‌కోడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత కాలంలోనూ ఇవే వాడకలోకి వచ్చారు.
0 Comments