Header Ads Widget

కరోనాలో కొండెక్కిన చదువు

 కరోనా ప్రభావంతో సంవత్సరన్నర పాటు మూతబడ్డ విద్యాలయాలు క్రమక్రమంగా ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి... కరోనా కాలంలో పిల్లలంతా ఇంటి దగ్గర నుండే చదువుకొన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థుల నుండి ట్యూషన్‌ ఫీజులు వసూలు చేసి ఆన్‌లైన్‌  పాఠాలు చెప్పారు. పరీక్షలు కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఫలితాల అనంతరం పై క్లాసులకు ప్రమోషన్‌ కూడా ఆన్‌లైన్‌లో జరిగిపోయింది. కాని 60 శాతంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌ చదువు పూర్తిగా దూరమైంది. వారు దూరదర్శన్‌లో వచ్చే పాఠాలను వినాలి. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య ఉండే సంబంధం కరోనా కాలంలో పూర్తిగా తెగిపోయింది. ప్రైవేట్‌ పాఠశాలల వారికి కనీసం టీచర్లు తెరమీదనైనా కనిపిస్తారు. కానీ దూరదర్శన్‌లో వాళ్లకు రెగ్యులర్‌గా పాఠాలు చెప్పే టీచర్‌ కన్పించరు. పాసయ్యాం పై క్లాసులకు ప్రమోట్‌ అయ్యామని సంతృప్తి తప్ప ఆచరణలో పిల్లలు చదువుకు దూరమయ్యారు. అంతకు ముందు సంవత్సరాలలో చదువుకొన్నది కూడా మర్చిపోయారు. తరగతి రీత్యా ప్రమోట్‌ అయినా విజ్ఞానం రీత్యా డిమోట్‌ అయ్యినట్లే లెక్క.

స్కూల్‌ పిల్లలు అత్యధికం ఆటపాటల్లో మునిగిపోయారు. వారికి ఇంటి వద్ద చదువు గాని, ట్యూషన్‌ లాంటివి గాని లేవు. విద్యా వాతావరణమే లేకుండా పోయింది. విద్యాలయంలో తోటి సహచరులతో ఉండే సాంగత్యం, టీచర్లతో ఉండే అనుబంధం వారికి చదువుకొనే వాతావరణాన్ని పెంపొందిస్తుంది. అర్ధం కాకపోతే మరలా చెప్పడం, చెప్పింది అర్ధమయిందా? లేదా? తెలుసుకోవడానికి ప్రశ్నలు వేయడం, నోట్స్‌ రాసుకుంటున్నారా? లేదా? పరిశీలించడం ఈరకంగా విద్యార్థి ప్రగతిపై టీచర్‌కు పట్టు ఉంటుంది. ఈ కాలంలో అవన్నీ తెరమరుగయ్యాయి. వారు వింటున్నారా లేదా? వింటే బుర్రకెక్కుతున్నదా లేదా తెలుసుకోవడమే కష్టం. టీవీల ముందు కూర్చొని పాఠాలు విన్న వారి సంఖ్య 20 శాతం కు మించి ఉండదని ఒక సర్వేలో వెల్లడయింది. ప్రభుత్వం ఆన్‌లైన్‌ పాఠాలు వినే సదుపాయం కల్పించనందున ప్రైవేట్‌ విద్యార్థుల కన్నా ప్రభుత్వ విద్యార్థులు వెనుకబడ్డారు. 'నాడు నేడు' పేరుతో పాఠశాల ఆవరణం అందాలతో తీర్చి దిద్దినా అది ఎందుకూ కొరగాకుండా పోయింది. కరోనాతో ఆన్‌లైన్‌ విద్య అనివార్యమనడంలో సందేహం లేదు. కాని అది సంప్రదాయ విద్యకు ప్రత్యామ్నాయం కాదు. తాత్కాలికంగానైనా ప్రభుత్వం ఆన్‌లైన్‌ విద్యకు అవసరమైన ఏర్పాట్లు చేయలేదు. అమ్మఒడి డబ్బుల్ని కట్‌ చేసి లాప్‌టాప్‌ కొనిస్తామని ఇప్పుడంటున్నారు. కాని కరోనా ఆరంభంలోనే ప్రభుత్వ ఖర్చుతో కనీసం ట్యాబ్‌ అయినా ఇచ్చి ఉంటే పరిస్థితి కొంత భిన్నంగా ఉండేది. ఇప్పుడైనా అమ్మఒడి డబ్బులు కట్‌ చేయకుండా ప్రభుత్వ ఖర్చుతోనే ప్రతి విద్యార్థికి ఉచితంగా లాప్‌టాప్‌ ఇవ్వాలి. కాని ఆ పేరుతో ఆన్‌లైన్‌ విద్యను శాశ్వతం చేయరాదు. ఆన్‌లైన్‌ విద్యావ్యాపారం జోరందుకుంటోంది. దాన్ని నిలువరించాలి.

ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజు కట్టడంతోపాటు ఆన్‌లైన్‌ చదువు కోసం స్మార్ట్‌ ఫోన్‌ లేదా ట్యాబ్‌ కొనటం తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారింది. తల్లిదండ్రుల ఫోన్లు పిల్లలకిస్తే మధ్యలో వచ్చే కాల్స్‌తో పాఠాలపై కేంద్రీకరణ దెబ్బతింటుంది. రాష్ట్రంలో జరిగిన ఒక సర్వే ప్రకారం 25 శాతం మంది పిల్లలకు స్మార్ట్‌ ఫోన్లు లేవు. 40 శాతం పిల్లలకు సరైన ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్‌ ఉన్నా ఆ వేగం సరిపోదు. చదువుపై ప్రత్యేక శ్రద్ధ, పట్టుదల ఉన్నవారు మాత్రమే కిందా మీదా పడి చదువుకున్నారు. మిగతావారికి చదువు చెప్పినట్లు  లెక్క తప్ప అది తలకెక్కింది లేదు.

కరోనా కాలంలో చదువు కోసం సెల్‌ఫోన్ల వాడకం పెరిగింది. విద్యార్థి చేతిలో సెల్‌ఫోన్‌ సరికొత్త సమస్యలకు దారి తీసింది. యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా వీడియోలు చూడడం, మ్యూజిక్‌ వినడం పెరిగింది. ఆమేరకు పిల్లల్లో సాంస్కృతిక అభిలాష పెరిగితే సంతోషించవచ్చు, కాని సెల్‌ఫోన్‌ కొన్ని పెడధోరణలకు దారితీసింది. ముఖ్యంగా వీడియో గేమ్స్‌ బాగా వ్యాప్తి లోకి వచ్చాయి. అత్యధికులకు రమ్మీ, ఫ్రీ ఫైర్‌ వంటి గేమ్స్‌ బాగా వ్యసనంగా మారాయి. పబ్జి బాగా పాపులర్‌ అయింది. ఈ వ్యామోహం లో పడ్డవారికి ఏదీ కనిపించదు. వినిపించదు. మరో సైకో ప్రపంచంలోకి వెళ్లిపోతారు. కొన్ని తరహా గేమ్స్‌, రియాలిటీ షోలకు బెట్టింగ్‌ పెట్టి ఆడడం పరిపాటి అయ్యింది. డబ్బుల కోసం అప్పులు చేయడం, అప్పులు తీర్చడానికి ఇంట్లో ఒత్తిడి చేయడం, అబద్ధాలు చెప్పడం లాంటి సంస్కృతికి అలవాటు పడ్డారు. స్నేహితుల మధ్య ఘర్షణలు పెరిగాయి. ఆడపిల్లల వెంటపడడం, వేధించడం పెరిగింది. ఆన్‌లైన్‌ స్నేహాల పేరుతో ఆడ పిల్లలు మోసాలకు గురవడం పెరిగింది. స్కూలు పిల్లల మధ్య పెరిగినవారు ఒక్కసారిగా స్థానిక లొకాలిటీలో వివిధ రకాల పిల్లలతో సంపర్కం ఏర్పడింది. అనేక మంది మొదటిసారి తాగుడు లాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. బీరు తాగడం ఫ్యాషన్‌ అని భావిస్తున్నారు. సినిమాలు కూడా అదే సంస్కృతి నేర్పించింది. రకరకాల స్కీముల పేరుతో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అమ్మఒడి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని తమకు ఇవ్వాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి చేసిన పిల్లలున్నారు. కొందరికి సెల్‌ఫోనే ఒక వ్యసనంగా మారింది. ఈ దుష్పరిణామాల మధ్య అనేక మంది చదువుకు దూరమయ్యారు. కొద్ది మంది మాత్రమే చదువుపై కేంద్రీకరించగలిగారు. దీని తీవ్రత ఎంత ఉందో ప్రభుత్వం అధ్యయనం చేయాలి.

కరోనా కాలంలో డ్రాపౌట్ల రేటు కూడా పెరిగింది. ఇంటి దగ్గర ఉన్న పిల్లల్ని పనులకు పంపడం, తల్లిదండ్రుల పనులకు సహాయం చేయడం పెరిగింది. ఆన్‌లైన్‌ సదుపాయం లేక, ఒకవేళ వున్నా అర్ధంకాక చదువుకే స్వస్తి చెప్పిన వారున్నారు. అయితే కరోనా కాలంలో ఆన్‌లైన్‌ మినహా మరో మార్గం లేదు. ఆన్‌లైన్‌తో పాటు విద్యార్థులపై నిరంతర అజమాయిషీ, పరిసరాల్లో విద్యాబోధన లాంటి పద్ధతులు అవలంభించనందున బోధనేతర పద్ధతులకు అలవాటుపడి డ్రాపౌట్లు పెరిగాయి. రిజిష్టర్‌లో విద్యార్థిగా నమోదయ్యి ఉపాధి పనులకు పోయినవారెందరో ఉన్నారు. అమ్మఒడి స్కీం, మద్యాహ్న భోజనం, విద్యా కానుక వంటి పథకాలు చాలావరకు పిల్లల్ని బడిలో నిలబెట్టాయి. ఈ స్కీములే లేకుంటే కరోనాలో విద్యార్థుల సంఖ్య మరింత పడిపోయి ఉండేది.

కరోనా కాలంలోనూ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంతో రిస్క్‌ తీసుకొని ప్రాణాలను ఫణంగా పెట్టి విధులకు హాజరయ్యారు. పిల్లలు లేకపోయినా ప్రభుత్వం చెప్పిన పనులు చేస్తూ కూర్చున్నారు. ఈ క్రమంలో దాదాపు 1000 మంది ఉపాధ్యాయులు ప్రాణాలర్పించారు. ప్రభుత్వం నుండి వారి కుటుంబాలకు ఎలాంటి సహాయం అందలేదు. అయినా ప్రభుత్వ ఉపాధ్యాయులు అష్ట కష్టాలు పడి విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రైవేట్‌ టీచర్ల కథ మరో రకంగా ఉంది. వారికి జీతభత్యాల్లేవు. ఉపాధి లేదు. అనేక మంది టీచర్లు ఉపాధి పనులకు వెళ్లారు. కుటుంబాలను పోషించుకోడానికి ఆటోలు తోలారు. ఏదీ దొరక్కుంటే పస్తులున్నారు.

ప్రైవేటు విద్యాలయాలన్నిటి పరిస్థితి ఒకే రకంగా లేదు. కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీలు దర్జాగా ఫీజులు వసూలు చేసి డబ్బు సంపాదించాయి. ఎక్కడా కనికరం చూపలేదు. ప్రభుత్వ నిబంధనలు పాటించలేదు. పాటించాలని ప్రభుత్వాలూ వారిపై ఒత్తిడి తేలేదు. ప్రభుత్వ అధికారుల దృష్టంతా చిన్న యాజమాన్యాల పైనే పడింది. విద్యార్థుల నుండి ఫీజులు రాక, ఉపాధ్యాయులకు జీతాలివ్వలేక వారూ స్కూళ్లు మూసేసుకున్నారు. ఆ పిల్లలంతా అధిక భాగం ప్రభుత్వ స్కూళ్లలో చేరారు. ఆ రకంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 7 లక్షలు పెరిగింది. కాని అందుకు తగిన వసతులు లేవు. టీచర్లు లేరు. నిధులూ కేటాయించలేదు. ఈ స్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ స్కూళ్లను, ఉపాధ్యాయుల్ని, ప్రైవేటు రంగంలోని చిన్న స్కూళ్లను ఆదుకోడానికి ఎలాంటి పథకమూ ప్రవేశపెట్టలేదు. అంబానీ, అదానీల కోసం లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించిన మోడీ సర్కారు విద్యను నిర్లక్ష్యం చేసింది. పిల్లల్ని, టీచర్లను వీధుల్లో పడేసింది.

ప్రజల్ని నిర్దాక్షిణ్యంగా కరోనా కాటు వేస్తుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఆదుకోకపోగా అదనపు భారాలు మోపాయి. సందట్లో సడేమియా అన్నట్లుగా ప్రజలెవ్వరూ ఏ భారం వేసినా, ఏ మార్పులు చేసినా పట్టించుకోరన్న ధీమాతో తామనుకున్న కార్పొరేట్‌ అనుకూల సంస్కరణలు సాగించుకుంటూ పోయారు. ఒక వైపు కేంద్రం నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) పేరుతో విద్యను వ్యాపారం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండే విద్యను తాను లాగేసుకుంది. అయినా మన రాష్ట్ర ప్రభుత్వం మారు మాట్లాడకుండా మిన్నకుండి పోయింది. మరోవైపు తానూ మార్పులకు శ్రీకారం చుట్టింది. పేదలకు నాణ్యమైన విద్య అన్నపేరుతో అసలు చదువులకే దూరం చేస్తోంది. ఉన్న చదువులే కరోనాలో అందుబాటులో లేవు. చదివింది మర్చిపోయారు. వారికి రిఫ్రెషింగు కోర్సులు పెట్టి పైతరగతికి అనుగుణంగా తయారు చేయాల్సిన దశలో ఆరు దశల స్కూలింగు పేరుతో అర్ధంపర్ధం లేని గందరగోళ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మార్పులు విద్యార్థులకే కాదు టీచర్లకు సైతం అర్ధం కాలేదు. విద్యావేత్తలు వీటిని వ్యతిరేకిస్తున్నా లెక్క చేయకుండా అమలు జరపడానికి పూనుకుంటున్నది. అంగన్‌వాడీలలో వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులు చేసినా ఈ సంస్కరణలు సామాన్యులను చదువుకు దూరం చేసేవే అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా హైస్కూలు విద్యలో డ్రాపవుట్లు పెరుగుతాయి. ఉన్నత విద్య ఖరీదవుతుంది. విద్యపై కార్పొరేట్‌ పెత్తనం పెరుగుతుంది. చదువు కొందరికే అన్న నానుడి నిజమవుతుంది. ఈ ప్రమాదాన్ని నివారించి అందరికీ నాణ్యమైన ఉచిత విద్య అందించాలని ఉద్యమించాలి.

                                                                                                                              - వి. శ్రీనివాసరావు 

Post a Comment

0 Comments