Header Ads Widget

పూజా ద్రవ్యాలతో జర భద్రం!


హిందూ సంప్రదాయం ప్రకారం పండుగల సమయంలో లేదా ఇతర సందర్భాలలో దేవుళ్లను పూజించడం అనవాయితి. పూజలు చేస్తున్న సమయంలో కొబ్బరి కాయ కొట్టడంతో పాటు, అగరుబత్తి, దూప్‌స్టిక్స్ లాంటివి వెలిగిస్తూ ఉంటారు. ఓరకంగా చెప్పాలంటే భారతీయ పూజాసామాగ్రిల్లో వీటికి ప్రత్యేకస్థానం ఉంటుంది. మనస్సు ప్రశాంతత కోసం ఇలాంటి వాటిని కొన్ని సందర్బాల్లో ఆశ్రయిస్తుంటారు.  పొద్దున్నే లేచి దైవారాధన చేయందే చాలా మందికి రోజు గడవదు. అలా ప్రతి రోజు దేవునికి పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు తప్పకుండా వాడేది అగరబత్తి.. ఇది లేనిదే ఏ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించరు హిందువులు. వాటి వల్ల వచ్చే పొగ ఇల్లంతా కమ్మేస్తుంటుంది.చిన్న పూజగది ఉండి.. దాంట్లోనే కూర్చుని పూజ చేస్తూ రోజూ పొద్దునా సాయంత్రం అగరుబత్తులు, ధూప్‌స్టిక్స్‌ వెలిగిస్తూ ఎక్కువసేపు వాటి పొగ పీల్చే అలవాటుంటే జర భద్రంగా ఉండాలని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ఎందుకంటే.. ఆ సువాసనలేవీ సహజమైనవి కావు. చాలా వరకూ అలాంటి ఉత్పత్తులను రసాయనాలు, బొగ్గుపొడితో తయారుచేస్తున్నారు. ఆ అగరుబత్తుల్లో ఉండే కమ్మటి మల్లె వాసనో.. గులాబీల వాసనో.. సహజమైనవి కావు! అవన్నీ రసాయనాల సమాహారం. ఇలా మనం అగరుబత్తి, దూప్ స్టిక్స్ వెలిగించడం వల్ల ఉన్నట్టుండి దగ్గు, తుమ్ములు వస్తుంటాయి. ఆ సమస్యను మనం తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే.. చాలాసమయాల్లో దూప్‌స్టిక్స్, అగరుబత్తులు పాలీఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు, కార్బన్‌డైఆక్సైడ్ కలిగి ఉంటాయి. దీని వల్ల జలుబు, దగ్గు వంటి చిన్న సమస్యలే కాదు.. ఆస్తమా, క్యాన్సర్ వంటి ప్రమాదకర సమస్యలు కూడా చుట్టుముడతాయి. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. అగరుబత్తులు, స్టిక్స్‌లను వెలిగించడం వల్ల విడుదలయ్యే సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్‌డై మోనాక్సైడ్‌ల కారణంగా చిన్నపిల్లలు, యువకుల్లో చర్మ, కంటి సంబంధిత అలర్జీలు వస్తున్నాయి. ఎక్కువగా ఈ వాయువును పీల్చడం ద్వారా ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. ఒకవేళ ఆ సమయంలో ఇలాంటి సమస్యలను గుర్తించినట్లుయితే వెంటనే జాగ్రత్త పడటం అనేది మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల అగరు బత్తులు అందుబాటులో ఉన్నా యి. మొదటి రకం బొగ్గు పొడితో తయారు చేసినవి కాగా.. రెండో రకం వుడ్‌ స్టిక్స్‌. బొగ్గు పొడితో తయారైనవి చాలా తక్కువ ధర ఉంటాయి. ఏమాత్రం నాణ్యత లేని బొగ్గు పొడిని వినియోగించి వీటిని తయారు చేస్తారు. మార్కెట్లో 90% ఇలాంటివే ఉన్నాయి. బొగ్గుతో తయారు చేసిన అగరుబత్తులకంటే వుడ్‌తో తయారు చేసినవి, లేకుంటే ఔషధాలతో తయారు చేసినవాటిని వినియోగించడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. అగరుబత్తులే కాదు, పూజకు వినియోగించే కర్పూరంతోనూ పలు అనారోగ్య సమస్యలు వస్తాయని పరిశోధకులు ఇప్పటికే స్పష్టం చేశారు. సుదీర్ఘకాలం ఈ హారతి నుంచి వచ్చే పొగను పీల్చడం వల్ల మూత్రపిండ, కాలేయ సమస్యలు, నాడీ సమస్యలు వస్తాయని పలు పరిశోధనల్లో తేలింది. కర్పూర హారతికి బదులు నూనెలో ముంచిన వత్తిని వెలిగించి కూడా దేవుడికి హారతి ఇవ్వొచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన అగరొత్తుల ధూపం మంచిదే. ఇది క్రిమిసంహారిణి. గుగ్గిలం అయితే శ్వాసకోశ సమస్యలను తొలగిస్తుంది. అందువల్ల స్వచ్ఛమైనసాంబ్రాణి (గుగ్గిలం) మాత్రమే పూజకు వినియోగించొచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

Post a Comment

0 Comments