Ad Code

వ్యవసాయ రంగం - కొన్ని పొరపాటు అభిప్రాయాలు


భారతదేశంలో వ్యవసాయ రంగం గురించి పలు దురభిప్రాయాలు ఉన్నాయి. వాటిని గనుక వెంటనే తొలగించుకోకపోతే, ప్రస్తుతం మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం మీద అవి ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.

మొదటి_దురభిప్రాయం: రైతాంగ వ్యవసాయం లోకి కార్పొరేట్ల చొరబాటు అనేది ఆ కార్పొరేట్లకు, రైతాంగానికి మాత్రమే సంబంధించిన సమస్య. ఇలా భావించడం తప్పు. రైతు వ్యవసాయంలోకి కార్పొరేట్లు చొరబడడం అనేది మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేస్తుంది. ఇది అందరికీ సంబంధించిన సమస్య. ఇలా చెప్పడం అంటే అదేదో వాదన కోసం చెప్తున్నట్టు భావించవద్దు. ఇది నిజంగానే అందరికీ సంబంధించిన సమస్య.  రైతులు ఇప్పుడు కార్పొరేట్ల చొరబాటుకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటం కేవలం ఆ రెండు తరగతుల మధ్యా సాగుతున్న వివాదం ఎంత మాత్రమూ కాదు (ఒక ఫ్యాక్టరీలో యజమానికి, కార్మికులకు నడుమ తలెత్తిన వివాదం వంటిది కాదిది). కార్పొరేట్ల చొరబాటుకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నది మొత్తం సమాజపు ప్రయోజనాలను రక్షించడం కోసం. భారతదేశాన్ని ''ఆహార సామ్రాజ్యవాదం'' బారి నుండి కాపాడేందుకు సాగిస్తున్న పోరాటం అది. నేరుగా రైతులకు దక్కే వాటాలో కొంత భాగాన్ని కాజెయ్యడమో, లేక వ్యవసాయోత్పత్తుల ధరలు పెరిగినప్పుడు ఆ పెరుగుదల ప్రయోజనం రైతులకు దక్కకుండా తామే దక్కించుకోవడమో, వాటి ధరలు పడిపోయినప్పుడు ఆ ధరల పతనాన్ని రైతుల మీదకు నెట్టివేసి తాము మాత్రం తప్పించుకోవడమో- ఇటువంటివి మాత్రమే కార్పొరేట్ల చొరబాటు వలన జరిగే పర్యవసానాలు అని అనుకోవద్దు. ఆ చొరబాటు ఫలితంగా భూమి వినియోగం మారుతుంది. 

దేశానికి అవసరమైన ఆహారధాన్యాలను పండించే బదులు (సంపన్న దేశాల వద్ద ఆహార ధాన్యాల నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. వాటిని ఆ దేశాలు మూడవ ప్రపంచ దేశాలకు అమ్ముకోడానికి ప్రయత్నిస్తున్నాయి) ఆ సంపన్న దేశాలలో పండని ఆహారేతర పంటలను పండించడానికి మన వ్యవసాయ భూములను వినియోగించడం జరుగుతుంది.

అందువలన మన దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గి సంపన్న దేశాల అవసరాలను తీర్చడానికి కావలసిన పంటలు పెరుగుతాయి. ఈ దిశగా మన వ్యవసాయాన్ని ప్రభావితం చేయడానికి ఇప్పటికే ఆహార పంటలకు ఇచ్చే కనీస మద్దతు ధర విధానాన్ని దెబ్బ తీస్తున్నారు. కొన్ని వందలసార్లు మోడీ ప్రభుత్వం కనీస మద్దతు ధర విధానం కొనసాగు తుందని చెప్పి వుండవచ్చు. కాని ఆ హామీకి ఒక చట్ట రూపం కల్పించేందుకు వీలుగా వ్యవసాయ చట్టాలను సవరించడానికి మాత్రం ప్రభుత్వం సిద్ధంగా లేదు.  ఈ ప్రభుత్వం ఉద్దేశ్యం స్పష్టమే. కనీస మద్దతు వ్యవస్థను మొత్తంగా అంతం చేయడం దాని లక్ష్యం. అలా చేసినప్పుడే ఆహార పంటలను పండించడంలో రైతులు ఎక్కువ నష్టాలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ విధమైన నష్టాలను భరించేంత స్తోమత రైతులకు ఉండదు. వారిలో ఎక్కువమంది పేదవారు. కనుక ఏ విధమైన రిస్క్‌నూ తీసుకోలేరు. ఒకవైపు నుండి కార్పొరేట్లు వారిమీద ఆహారేతర పంటలను ఎక్కువగా పండించమని ఒత్తిడి పెంచుతారు. మరొకవైపు ప్రభుత్వం ఆహార పంటల కనీస మద్దతు ధర విధానాన్ని ఎత్తివేస్తుంది.  రెండు వైపులా వచ్చే ఒత్తిడి ఫలితంగా రైతులు ఆహార పంటలను పండించడం మానుకోవలసిన పరిస్థితులు వస్తాయి. ఇక్కడ ఒక ప్రశ్న ఎదురవవచ్చు. ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటే నష్టం ఏమిటి? మనం పండించే ఇతర పంటలను ఎగుమతి చేయడం ద్వారా వచ్చే ఆదాయం నుండి అందుకవసరమైన సొమ్ము చెల్లించవచ్చు కదా? 

మొదటిది: ఆహారధాన్యాలను దిగుమతి చేసుకోడానికి కావలసిన విదేశీ మారక ద్రవ్యం మన వద్ద తగినంతగా ప్రతీ సందర్భంలోనూ ఉండకపోవచ్చు. మనం పండించే ఇతర పంటల ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయానికి, మన ఆహారధాన్యాల దిగుమతులకు కావలసిన విదేశీ మారక ద్రవ్యానికి మధ్య ప్రతీసారీ సమతూకం ఉంటుందని భావించలేము. పైగా భారతదేశం వంటి అధిక జనాభా ఉన్న దేశం అంతర్జాతీయ మార్కెట్‌ నుండి ఆహారధాన్యాల దిగుమతికి పూనుకుంటే ప్రపంచ మార్కెట్‌ లో ఆహారధాన్యాల ధరలు అమాంతం పెరుగుతాయి. అప్పుడు వాటిని కొనుగోలు చేయడానికి మనకు మరింత ఎక్కువగా విదేశీ మారకద్రవ్యం అవసరం అవుతుంది.

రెండవది: ఆహారధాన్యాలను దిగుమతి చేసుకోడానికి కావలసినంత విదేశీమారక ద్రవ్యం మన వద్ద ఉన్నప్పటికీ, వాటిని కొనడానికి కావలసిన కొనుగోలుశక్తి ప్రజల దగ్గర కూడా ఉండాలి కదా. ఆహారపంటల సాగు నుండి వేరే పంటలవైపు వ్యవసాయాన్ని మళ్ళిస్తే ఆ దేశంలో ప్రజల కొనుగోలుశక్తి తప్పనిసరిగా పడిపోతుంది. ఆ ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా దొరికే పనిదినాలు ఆహార పంటలతో పోల్చితే తక్కువగా ఉంటాయి. అందువలన వ్యవసాయ రంగంలో పని దినాలు తగ్గిపోతాయి. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. అందువలన దిగుమతి చేసుకునే ఆహారధాన్యాలను కొనగలిగే పరిస్థితి వారికి ఉండదు. దీనికి తోడు సామ్రాజ్యవాద దేశాలు మన చేయి మెలిపెట్టి వారికి అనుకూలంగా మలుచుకునే ఎత్తుగడలు ఎప్పుడూ ఉండనే వుంటాయి. ఆహారధాన్యాలను దిగుమతి చేసుకోవలసి వస్తే ఆ సామ్రాజ్యవాద దేశాల నుండే చేసుకోవాల్సి వుంటుంది. వారి వద్దే ఆ మిగులు ధాన్యాలు ఉంటాయి. మరే విషయంలోనైనా భారతదేశం గనుక ఆ సామ్రాజ్యవాద దేశాలు ఆదేశించిన విధంగా నడుచుకోడానికి తిరస్కరిస్తే అప్పుడు మనకు ఆహారధాన్యాలు అమ్మేది లేదని వారు నిరాకరించవచ్చు.  అప్పుడు మన సరిస్థితి ఏమిటి? అందుచేత ఆహారధాన్యాల కోసం ఆ సంపన్న దేశాల మీద ఆధారపడితే అది అంతిమంగా మన సార్వభౌమాధికారాన్నే దెబ్బ తీస్తుంది. ఈ వాస్తవాన్ని గ్రహించినందువల్లనే ఇందిరాగాంధీ ప్రభుత్వం హరిత విప్లవం చేపట్టి తద్వారా ఆహార ధాన్యాల విషయంలో స్వయంపోషకత్వాన్ని సాధించడానికి పూనుకున్నది (ఈ స్వయంపోషకత్వం మన ప్రజల కొనుగోలుశక్తి బాగా తక్కువగా ఉన్న పరిస్థితిలో సాధించినదే కావచ్చు). ఈ స్థితి నుండి మళ్ళీ వెనక్కు పోయి ఆ స్వయం పోషకత్వాన్ని కోల్పోయే దిశగా దేశాన్ని మోడీ తెచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలు నెడతాయి. ఇటువంటి పరిస్థితి మన దేశంలో రావాలని సామ్రాజ్యవాద దేశాలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నాయి. బొత్తిగా వెన్నెముక లేని మోడీ ప్రభుత్వం వారికి దాసోహమంటున్నది.

ఆ విధంగా లొంగిపోకుండా ప్రతిఘటించే వైఖరిని రైతాంగ ఉద్యమం చేపట్టింది. ఆ నల్ల చట్టాలను ఆమోదించి, ఆ తర్వాత రైతులకు ఎంత వాటా, కార్పొరేట్లకు ఎంత వాటా అన్న బేరాలకు దిగడం అంటే ఇంకా ఎంతో కొంత మిగిలివున్న మన దేశ సార్వభౌమాధికారాన్ని పూర్తిగా వదులుకుని సామ్రాజ్యవాదానికి లొంగిపోవడమే. దీనికి తోడు చాలా కాలంగా కొనసాగుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా వదులుకోవలసి వస్తుంది. గ్యారంటీ లేని దిగుమతుల మీద ఆధారపడి ప్రజాపంపిణీ వ్యవస్థను కొనసాగించడం సాధ్యం కాదు.

ఇక_రెండో_దురభిప్రాయం : కనీస మద్దతు ధరను, ధాన్యసేకరణను గ్యారంటీ చేసే ఒక దేశవ్యాప్త వ్యవస్థ భారతదేశానికి అవసరం లేదు. పంజాబ్‌, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌-ఈ మూడు ప్రాంతాలూ ఆహారధాన్యాల ఉత్పత్తిలో మిగులు సాధించే ప్రాంతాలు. కనుక ఈ మూడు ప్రాంతాలకే పరిమితమై ఎఫ్‌.సి.ఐ ధాన్య సేకరణకు పూనుకుంటే దానితో ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వహించవచ్చునని, దేశవ్యాప్తంగా కనీస మద్దతు ధర వ్యవస్థ గాని, ధాన్య సేకరణ గాని అవసరం లేదని ఒక వాదన ఉంది.  అలా దేశ వ్యాప్తంగా సేకరించినందువలన అనవసరంగా ఆహారధాన్యాల నిల్వలు పేరుకుపోతాయని, వాటి నిర్వహణ ఖర్చు పెరిగిపోతుందని, ఆ సేకరణ కోసం ప్రభుత్వం బ్యాంకుల నుండి తెచ్చే రుణాల మీద చెల్లించాల్సిన వడ్డీల భారం తడిసి మోపెడౌతుందని, దానిని మన బడ్జెట్‌ భరించలేదన్నది ఈ వాదన సారాంశం. అనవసరంగా బడ్జెట్‌లో ఇందుకోసం కేటాయింపులు చేయడం బదులు ధాన్య సేకరణను ఆ మూడు మిగులు ప్రాంతాల (పంజాబ్‌, హర్యానా, పశ్చిమ యు.పి) వరకు పరిమితం చేయడం మంచిదని ఈ వాదన అంటుంది. ఈ వాదన కూడా తప్పు. భారతదేశ వ్యవసాయం గురించి బొత్తిగా ఏమీ తెలియనివారే ఈ విధంగా వాదిస్తారు. ఎఫ్‌.సి.ఐ ఇతర రాష్ట్రాల నుండి సేకరించేది పెద్దగా ఏమీ ఉండదు. అందువలన కనీస మద్దతు ధరను పెంచినందువలన ఎఫ్‌.సి.ఐ చెల్లించవలసిన మొత్తంలో పెరుగుదల కూడా పెద్దగా ఉండబోదు. ఐతే మద్దతు ధర అనేది మార్కెట్‌లో కనీస ధర ఎంత ఉండాలి అనేదాన్ని నిర్ధారిస్తుంది. అందుచేత మద్దతు ధర పెరిగితే బహిరంగ మార్కెట్‌లో కూడా ధాన్యానికి లభించే ధర పెరుగుతుంది. ఫలితంగా రైతుల ఆదాయాలు పెరుగుతాయి.  ఎఫ్‌.సి.ఐ ద్వారా కొనుగోలు చేసే ధాన్యానికి మాత్రమే కాక ఇతరులు కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా పెరుగుతాయి. ఎఫ్‌.సి.ఐ సేకరించే ధాన్యం పరిమాణంతో నిమిత్తం లేకుండా ఈ పెరుగుదల ఉంటుంది. మరి బహిరంగ మార్కెట్‌ లో డిమాండ్‌ గనుక పెరగకపోతే, బహిరంగ మార్కెట్‌లో సేకరణ మాత్రం ఎలా పెరుగుతుంది? అక్కడ సేకరణ గనుక పెరగకపోతే అప్పుడు ఎఫ్‌.సి.ఐ కొనుగోలు చేసితీరాల్సిందే కదా? అన్న ప్రశ్న వస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధి లోకి రాని జనాభా కొనుగోలు చేసే ఆహారధాన్యాల పరిమాణం పెద్దగా మార్పులకు గురికాదు. ఆహారధాన్యాల ధరలు పెరిగినా ఆ తరగతి ప్రజానీకం తమ అవసరాలకు కావలసిన ఆహారాన్ని కొనుగోలు చేయగలరు. అందుచేత బహిరంగ మార్కెట్‌లో అమ్ముడుపోయే ఆహారధాన్యాల డిమాండ్‌ పెద్దగా మార్పులకు లోనవదు. అంటే, కనీస మద్దతు ధర పెంచినందు వలన బహిరంగ మార్కెట్‌లో ఆహారధాన్యాల ధరలు పెరిగి డిమాండ్‌ పడిపోయే పరిస్థితి ఉత్పన్నం కాదు. డిమాండ్‌ పడిపోయినందు వలన బహిరంగ మార్కెట్‌ కొనుగోలు చేయక, ఎఫ్‌.సి.ఐ మీద ఆ మిగులు ధాన్యాన్నంతటినీ కొనుగోలు చేయవలసిన బాధ్యత పడుతుందన్న వాదన చెల్లదు. అందుచేత దేశవ్యాప్తంగా అమలుజరిగే కనీస మద్దతు ధర విధానం దేశం మొత్తం మీద రైతులకు కనీస ఆదాయాన్ని గ్యారంటీ చేస్తుంది. అదే సమయంలో ప్రభుత్వం నిర్వహించవలసిన నిల్వల మీద దాని ప్రభావం పెద్దగా పడదు. ఎఫ్‌.సి.ఐ తగినంత శ్రద్ధ చూపనందువలన ఇతర రాష్ట్రాలలో (మిగులు రాష్ట్రాలు మూడు కాక) ధాన్య సేకరణకు పూనుకోవడం లేదు. అందువలన కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి కొంత కొనుగోలు చేపడుతున్నాయి. ఆ కొనుగోళ్ళ ద్వారా అవి పెద్దగా సేకరణ చేసివుండకపోవచ్చు. కాని అక్కడ రైతులకు అవి కనీస ఆదాయాన్ని గ్యారంటీ చేయ గలుగు తున్నాయి. అందువలన ఎఫ్‌సిఐ ద్వారా జరిగే ధాన్య సేకరణను కొన్ని ప్రాంతాలకే పరిమి తం చేయడం బదులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కూ మరింతగా విస్తరిపజేయడం ఇప్పుడు అవసరం.

అందుచేత ఇప్పుడు జరుగుతున్న రైతుల ఆందోళన కేవలం ఆ కార్పొరేట్లకు, రైతులకు మాత్రమే సంబంధించిన వివాదం అన్న వాదన కాని, దేశం మొత్తానికి వర్తించే కనీస మద్దతు ధర విధానం, దేశవ్యాప్తంగా ఎఫ్‌సిఐ ద్వారా ధాన్య సేకరణ చేపట్టడం ప్రభుత్వానికి మోయలేని భారం అవుతుందన్న వాదన కాని చెల్లవు. ఇటువంటి వాదనలు రైతాంగ ఉద్యమాన్ని దెబ్బ తీయడానికే ఉపయోగపడతాయి. అందుచేత ఆ చెల్లని వాదనలను తిప్పికొట్టడం ఎంతైనా అవసరం.

Post a Comment

0 Comments

Close Menu