Ad Code

"అప్రశిఖ"

 

మాళవ దేశము లోని ఒక గ్రామములో యిద్దరు బాలురు చిన్నతనమునుండీ ఒకే చోట చదువుకుంటూ స్నేహంగా వుండేవారు. వారిద్దరూ యింకా చదువుకోవాలనే ఆశతో కాశీకి వెళ్లి అక్కడ యిద్దరూ ఒక గురువు దగ్గరనే విద్యాభ్యాసము చేస్తూండేవారు. చాలా కాలము విద్య నేర్చుకున్న తర్వాత తమ గ్రామమునకు పోదామనుకున్నారు. వారిద్దరిలో ఒకడు మేధావి, మరొకడు మందబుద్ధి. ఇద్దరూకలిసి స్వదేశ మునకు  బయల్దేరారు. మార్గమధ్యం లో అనేక రాజాస్థానములలొ తమ విద్య ప్రదర్శించి చాలా డబ్బు గడించారు. మేదావినే అందరూ ఎక్కువ గౌరవించి ఎక్కువ ధనము యిచ్చేవారు. మందబుద్దికి తక్కువ ధనము దొరికేది. దానితో వాడిలో అసూయ మొదలైంది. ఈ మేధావి తమ గ్రామమునకు పోయిన తర్వాతకూడా అందరూ వాడినే ఎక్కువ గౌరవించి ఎక్కువ ధనము యిస్తారు. వీడినేలాగైనా మార్గ మధ్యములొ చంపేసి తానొక్కడే గ్రామమునకు వెళ్లాలని నిశ్చయించుకుని అవకాశము కోసము ఎదురు చూడ సాగాడు. ఒకనాడు వారి వూరికి  దగ్గరగానున్న  అరణ్య మార్గములో నడచుచూ అలసిపోయి ఒక చెట్టు నీడలో ఇద్దరూ విశ్రమించారు. మందబుద్ధి కుతంత్రము తెలియని మేధావి హాయిగా నిద్రపోయాడు. మందబుద్దికి నిద్ర రాలేదు. తామిద్దరూ వూరికి పోయిన తర్వాత అందరూ మేధావినే గౌరవిస్తారు. వాడే ఎక్కువ ధనము సంపాదిస్తాడు. నన్నెవరూ గౌరవించరు. వీడిని ఎలాగైనా చంపెయ్యాలి మరీ ఒకసారి వీడు నాకు చిన్ననాటి స్నేహితుడు కదా! నన్ను నమ్మి హాయిగా  నిద్ర పోతున్నాడు. వీడిని చపుట అధర్మము కదా! యింటికి వెళ్లి వీడి తల్లిదండ్రులకు, బంధువులకూ యేమని చెప్పాలి ? అని ద్వైదీ భావనతో ఆలోచిస్తున్నాడు. చివరకు అధర్మమే గెలిచింది. ఆ మందబుద్ధి వీడిని యిక్కడే చంపివేసి పులి వాడిని చంపి వేసినదని చెప్తామనుకుని మేధావి తలను తన కాళ్ళ మధ్య యిరికించుకొని కత్తి తీసి మేధావిని చంప బోయాడు. మేధావికి మెలుకువ వచ్చి నన్ను చంపవద్దు అని బ్రతిమాలాడు. నీకు నేనేమి అపకారము చేశాను? నిన్ను నా తమ్ముని వలె ప్రేమగా చూసుకున్నాను. వూరికి వెళ్ళిన తర్వాత యీ ధనము నీకే  యిచ్చివేసి  నేను నా తల్లిదండ్రులను తీసుకొని  వేరే దేశమునకు వెళ్ళిపోతాను నీకు నేను అడ్డురాను నన్ను చంపవద్దు. మా తల్లిదండ్రులకు నేనొక్కడే కొడుకును అని పరి పరి విధములుగా బ్రతిమలాడాడు కానీ మందబుద్ధి మనసు కరగలేదు. సరే వీడు నన్ను చంపక మానడు అనుకోని మేధావి  మా తల్లిదండ్రులకు నా ఆఖరు మాటగా "అప్రశిఖ"అని మాత్రము చెప్పుఅన్నాడు. మందబుద్ధి సరేయని చెప్పి మేధావి గొంతును ఖడ్గముతో నరికి  చంపివేశాడు. తర్వాత వూరు చేరుకొని దొంగ ఏడుపు ఏడుస్తూ మేధావి తల్లిదండ్రులతో మీ  వాడిని పులి అడవిలోకి లాక్కొని పోయి చంపి వేసినదని చెప్పాడు పులి లాక్కొని వెళ్ళేటప్పుడు మీ కొడుకు మీకు తన ఆఖరు మాటగా "అప్రశిఖ" అనే పదం చెప్పమన్నాడు.అని చెప్పాడు. మేధావి తల్లిదండ్రులకు అనుమానము వచ్చింది. వీడే తమ కొడుకును ఏదో చేసేసి అపద్ధము చెప్తున్నాడు అని అనిపించింది. కానీ రుజువు లేదు కదా! వారికి ఆ 'అప్రశిఖ' అనేది మాత్రం అర్థం కాలేదు.వారు భోజరాజు దగ్గరకు వెళ్లి విషయము చెప్పి మీ ఆస్థానము లో ఎవరైనా ఈ 'అప్రశిఖ' అనే మాటకు అర్థమేమిటని  చెప్పగలరేమో నని వచ్చినాము అని అడిగారు. రాజు పండితుల వైపు చూశాడు.ఎవరూ జవాబు చెప్పలేదు.కాళిదాసు మాత్రము మీ కొడుకును మానవ మృగమే చంపినది. పులి కాదు. అతని వెంటవున్న అతని స్నేహితుడు మీ కొడుకు ఔన్నత్యము చూసి ఓర్వలేక అతన్ని చంపివేసి అపద్దాలాడు తున్నాడు. మీ కొడుకు మీకు తన తుది సందేశము గా'అప్రశిఖ' అనే   ఈ పదము పంపినాడు అని క్రింది శ్లోకమును చదివాడు.

             శ్లోకము:- అనేన తవపుత్రస్య

                          ప్రస్తుప్త వనాంతరే 

                          శిఖా మాక్రమ్య పాదేన  

                          ఖడ్గే నాభి హతం శిరః 

అర్థము:-అడవి మధ్యలో ఈ మందబుద్ధిచే మీకొడుకు నిద్రించు  చున్నప్పుడు కాలితో గొంతు నదిమి పట్టి ఖడ్గముతో తల నరికి వేసినాడు అన్ని పాదములలోని మొదటి అక్షరాలు కలిపితే 'అప్రశిఖ'అని వస్తుంది. దానినే మీకు సందేశము గా మీకొడుకు పంపించినాడు అని వివరించాడు కాళిదాసు. ఆ వృద్ధులు గోడు గోడున ఏడువ సాగారు. భోజరాజు మందబుద్ధి ని పిలిపించి నీవు చేసిన పాప కార్యము బయట పడినది నీవు మిత్రద్రోహము చేసి మేధావిని చంపినావు. యిప్పుడయినా తప్పు ఒప్పుకోమని గద్దించాడు.వాడు, మరీ ఆస్థానము లోని పండితులూ దానికి రుజువేమున్నదని వాదించారు. మేధావి అదే శ్లోకమును చెప్పినాడని మీరు నిరూపించండి అని పట్టు బట్టారు. అంతట కాళిదాసు రాజా! అడవినుండి ఆ శవ ఖండములను తెప్పించిన రుజువు చేయగలను అన్నాడు. రాజు అందులకు అంగీకరిచి  భటులను పంపించి ఆ శవ ఖండములను తెప్పించాడు. కాళిదాసు భువనేశ్వరీ దేవిని ప్రార్థించి తలను మొండెమునకు అతికించగానే మేధావి పునర్జీవితు  డయ్యెను. అప్పుడు అందరూ అతనిని ఆ "అప్రశిఖ" అను ఆ సాంకేతిక  మాటకు అర్థమేమిటని అడిగారు.మేధావి కాళిదాసు చెప్పిన శ్లోకము నే చెప్పినాడు. మందబుద్ధి ఏ తనను చంపినాడని చెప్పెను. అప్పుడు భోజరాజు మందబుద్ధిని   కఠినము గా శిక్షించి మేధావిని తనకొలువులో  ఆస్థాన కవులలో ఒకనిగా నియమించాడు.

Post a Comment

0 Comments

Close Menu