Ad Code

గూగుల్​ చాట్​లో ఆడియో, వీడియో కాలింగ్​


టెక్​ దిగ్గజం గూగుల్ తమ వర్క్​ స్పేస్​ ఫోరంలో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. ఆండ్రాయిడ్,  ఐఓఎస్ డివైజ్​లలో జీమెయిల్ వాడే వారి కోసం వరుసగా కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇటీవల జీమెయిల్​ యాప్​లో కొత్త సెర్చ్​ ఫిల్టర్​ను యాడ్​ చేసిన గూగుల్​.. ఇప్పుడు మరో ఫీచర్​ను జోడించింది. జీమెయిల్​లోని గూగుల్ చాట్  ద్వారా ఇప్పుడు 1:1 ఆడియో, వీడియో కాలింగ్​ సదుపాయాన్ని పొందే అవకాశం కల్పించింది. ఈ ఫీచర్​ను గూగుల్​ తన బ్లాగ్ పోస్ట్ ద్వారా ప్రకటించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ (IOS)​​ ప్లాట్‌ఫారమ్‌లలో మొబైల్ యూజర్ల కోసం కంపెనీ ఈ ప్రత్యేక అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. గతంలో కేవలం 1:1 చాట్‌ సౌకర్యం మాత్రమే జీమెయిల్​లో అందుబాటులో ఉండేది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఫీచర్​తో ఆడియో, వీడియో కాల్స్​ను కూడా ఆస్వాదించవచ్చు. అంతేకాదు, మీరు జీమెయిల్​లో చాట్ రోస్టర్ నుంచి మిస్డ్ కాల్స్​ వివరాలను కూడా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. మరోవైపు, ప్రాధాన్యతను బట్టి నేరుగా ఆడియో లేదా వీడియో కాల్  చేసుకునే అవకాశం కల్పించింది. స్క్రీన్ పైభాగంలోని బ్లూ కలర్​ బ్యానర్‌ ద్వారా కొత్తగా వచ్చిన కాల్స్​, మెసేజెస్ గురించి జీమెయిల్ మీకు తెలియజేస్తుంది. మీతో కాల్‌లో ఉన్న వ్యక్తి పేరు, కాల్ వ్యవధిని చూపిస్తుంది. అదేవిధంగా, మీ మొబైల్​కు వచ్చే మిస్డ్​ కాల్స్​ను ఎరుపు రంగులో చూపిస్తుంది. జీమెయిల్​ తాజా వెర్షన్​లో మాత్రమే.. వ్యక్తిగత గూగుల్​ ఖాతాల తో పాటు గూగుల్​ వర్క్​స్పేస్​, జీ సూట్​ బేసిక్​, బిజినెస్ కస్టమర్​ అకౌంట్లు గల యూజర్లందరికీ ఈ కొత్త కాలింగ్ ఫీచర్​ను తీసుకొచ్చింది. అయితే, ఈ ఫీచర్​ను ఆస్వాదించాలంటే కాల్స్ చేసే యూజర్​, స్వీకరించే యూజర్​ ఇద్దరూ జీమెయిల్​ తాజా వెర్షన్​ను ఉపయోగిస్తుండాలి. అప్పుడే, వారికి ఈ ఫీచర్​ కనిపిస్తుంది. "కరోనా తగ్గుముఖం పట్టడంతో అనేక కంపెనీలు హైబ్రిడ్ పని విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో సహోద్యోగులతో కనెక్ట్ అవ్వడాన్ని తాజాగా ఫీచర్​ సులభతరం చేస్తుందని మేము ఆశిస్తున్నాం.'' అని గూగుల్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.


Post a Comment

0 Comments

Close Menu