Ad Code

సీఈఓగా తప్పుకోవాలనుకుంటున్నా : ఎలన్ మస్క్


తాను సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నారట.. అంతేకాదు… అన్నీ వదిలేసి ఫుల్ టైం ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిపోతానని ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు. అంతటితో ఆగలేదు. తన నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో చెప్పడంటూ తన ఫాలోవర్లను అడిగాడు. ఎలన్‌ మస్క్‌. ఏది అంత తేలికగా నిర్ణయం తీసుకోరు. ఒకవేళ అనుకున్నారంటే.. అది కచ్చితంగా అమలు చేసి తీరుతారని ఆయనను ఫాలో అయ్యేవారి వాదన.. నిజంగా బాధ్యతల నుంచి తప్పుకుంటాడా? జోక్‌ చేశాడా? అంటే ఆయన ట్వీట్ల వెనుక వాస్తవం ఏదో ఉండే ఉండొచ్చునని ఆయన ఫాలోవర్లు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ ఇలానే టెస్లాలోని తన 10 శాతం వాటాను అమ్మేద్దామనుకుంటున్నానని ఫాలోవర్స్‌ అభిప్రాయం కోరాడు మస్క్. అప్పుడు అంతా నవ్వుకున్నారు కూడా. కానీ, టెస్లా బోర్డు సభ్యులతో పాటు అందరు షాక్ అయ్యేలా తన వాటాను అమ్మేశాడు. ఇప్పటికే 12 బిలియన్‌ డాలర్ల షేర్లను అమ్మేశాడు. ఇప్పుడు మళ్లీ మస్క్‌ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. మస్క్ ట్వీట్ ప్రభావం స్టాక్‌ మార్కెట్‌పైనా పడే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో మస్క్.. తాను మరికొన్నేళ్లు టెస్లా సీఈఓగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే ఫుల్ టైం ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిపోతానని మస్క్ చేసిన ట్వీట్‌కు రీట్వీట్ల వరద వెల్లువెత్తుతోంది. మస్క్ చేసిన ట్వీట్లకు సరదాగా ఫాలోవర్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ట్విట్టర్ యూజర్లు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారా? అయితే మీకు కోచింగ్ ఆఫర్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఎలోన్ మస్క్ చేసిన ట్వీట్‌పై స్పందించినవారిలో అమెరికన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ కూడా ఉన్నాడు. యూట్యూబ్‌లో వ్యూస్ ఎలా పొందాలో టెస్లా సీఈఓకి తాను కోచింగ్ ఇస్తానని చెప్పాడు. యూట్యూబ్‌ వ్యూస్ ఎలా పొందాలో నేను మీకు శిక్షణ ఇస్తాను.. అంటూ బీస్ట్ ట్వీట్ చేశాడు.

Post a Comment

0 Comments

Close Menu