Ad Code

లిథియమ్ బ్యాటరీలకు ప్రత్యామ్నాయంగా సోలార్ జనరేటర్లు


ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా బ్యాటరీ ఉండాల్సిందే. ఆ బ్యాటరీని చార్జ్ చేస్తేనే  ఎలక్ట్రిక్ వాహనం ముందుకు వెళ్లేది. ఈ బ్యాటరీలను లిథియంతో తయారు చేస్తారు. ఈ మధ్య వాహనాల వాడకం పెరగడం.. ప్రతి చోట బ్యాటరీల అవసరం కూడా పెరగడంతో లిథియంతో తయారు చేసే బ్యాటరీలకు డిమాండ్ పెరిగింది. లిథియం కొరతకారణంగా డిమాండ్‌కు తగ్గ సప్లయి మాత్రం ప్రస్తుతం అందడం లేదు. అనుకున్నంతగా లిథియం సరఫరా లేకపోవడంతో లిథియంతో తయారు చేసే బ్యాటరీలకు కొరత ఏర్పడుతుంది. ఇంకొన్ని ఏళ్ల తర్వాత పూర్తిగా లిథియం దొరక్కపోతే.. దానితో తయారు చేసే బ్యాటరీలు కూడా ఉండవు. దాని వల్ల ప్రపంచమే స్తంభించిపోయే ప్రమాదం ఉంది. దానికి అల్టర్నేట్‌గా యూఎస్‌ లోని లాస్ వెగాస్‌కు చెందిన పవర్ సొల్యూషన్స్ కంపెనీ బ్లుయెట్టి సోడియం అయాన్ సోలార్ జనరేటర్లను తయారు చేసింది. త్వరలో ప్రారంభం కాబోయే టెక్ ఈవెంట్ సీఈఎస్ 2022లో ఈ బ్యాటరీలను లాంచ్ చేయనుంది.  దానికి NA300 అనే పేరు పెట్టింది. లిథియం అయాన్‌ను కాకుండా.. సోడియం అయాన్‌ను ఉపయోగించుకొని ఈ సోలార్ పవర్ జనరేటర్‌ను కంపెనీ తయారు చేసింది. అలాగే.. జనరేటర్ కెపాసిటీని పెంచడం కోసం B480 పేరుతో సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్‌ను కూడా కంపెనీ సీఈఎస్ 2022లో లాంచ్ చేయనుంది. సోలార్ ఆధారిత బ్యాటరీలను వాహనాలకు వాడొచ్చు. ఇంటికి ఇన్వెర్టర్‌లా వాడుకోవచ్చు. బ్యాటరీ అవసరం ఉన్న ప్రతి చోట వీటిని వాడుకోవచ్చు. సోడియం, లిథియం.. రెండింటి కెమికల్ ప్రాపర్టీస్ దాదాపు ఒకేవిధంగా ఉండటం వల్ల.. బ్యాటరీలో వీటిని వాడి ఒకేవిధమైన కెమికల్ రియాక్షన్స్‌ను తీసుకురావచ్చు. ఈ భూమ్మీద సోడియం నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అందుకే.. సోడియంతో సోలార్ జనరేటర్లను తయారు చేసి.. లిథియంకు ప్రత్యామ్నాయంగా ఈ జనరేటర్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. 3000 వాట్స్ సోలార్ ఇన్‌పుట్ కెపాసిటీతో పాటు రెండు బీ480 బ్యాటరీ ప్యాక్స్‌(4800 డబ్ల్యూహెచ్‌)తో ఈ బ్యాటరీని 12600 డబ్ల్యూహెచ్ వరకు పెంచుకునే కెపాసిటీ ఇందులో ఉంటుంది. 6000 వాట్స్ డ్యుయల్ చార్జింగ్ కెపాసిటీతో 30 నిమిషాల్లో 80 శాతం వరకు చార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.


Post a Comment

0 Comments

Close Menu