Ad Code

ఐటీ కంపెనీల్లో హైబ్రిడ్ వర్క్ మోడల్ !

 

కరోనా కారణంగా అన్ని రంగాలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటుపడ్డాయి. ఇటీవల దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో  ఐటీ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ తదితర సంస్థలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీస్‌లకు పిలవడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ మేరకు హైబ్రిడ్ మోడల్ వర్క్‌ను ఎంచుకోవాలని ఐటీ సంస్థలు భావిస్తున్నాయి. ఐటీ కంపెనీలు '25x25 మోడల్'ను స్వీకరించడానికి ఉద్యోగుల కోసం అకేషనల్ ఆపరేటింగ్ జోన్లు, హాట్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది. ఈ మోడల్‌ ద్వారా కంపెనీ అసోసియేట్‌లలో 25 శాతం మంది ఏ సమయంలోనైనా ఆఫీస్ నుంచి పని చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే వారు ఆఫీస్‌ల్లో తమ సమయాన్ని 25 శాతానికి మించి కేటాయించాల్సిన అవసరం ఉండదు. "రాబోయే నెలల్లో మా ఉద్యోగులు తిరిగి ఆఫీస్‌లకు వచ్చేలా కృషి చేస్తాం. ఇప్పటికే ఆ పనిని మొదలు పెట్టాం, సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు క్రమం తప్పకుండా ఆఫీస్‌ నుంచి పని చేయడం ప్రారంభించారు.'' అని టీసీఎస్ తెలిపింది. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ కూడా హైబ్రిడ్ మోడల్‌కి మారుతున్నాయి. ఉద్యోగులను దశలవారీగా ఆఫీస్‌లకు తిరిగి పిలిపించాలని ప్లాన్ చేస్తున్నాయి. "మా వ్యాపార సాధారణ స్థితిని కొనసాగించడానికి, తద్వారా మా క్లయింట్‌లకు నిరంతరాయమైన సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నాం. ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తూనే హైబ్రిడ్ మోడల్‌లో పని చేయడం కొనసాగిస్తాం" అని హెచ్‌సిఎల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఐటీ కంపెనీలు 25/25 మోడల్‌ను అనుసరించడానికి ముఖ్య ఉద్దేశం మొదట ఉద్యోగలను ఆఫీసులకు వచ్చేటట్లు చేయడం. క్రమంగా హైబ్రిడ్ వర్క్ మోడల్‌లోకి మారడం కోసం ఈ విధానాన్ని ఫాలో కావాలని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా నియామకాలు ఉంటాయని టీసీఎస్ తెలిపింది. 40,000 నియామకాల లక్ష్యంతో కంపెనీ ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తోందని, అవసరమైతే మరింత వేగం పెంచుతామని టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్. జి. సుబ్రమణ్యం ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. 2021-22లో టీసీఎస్ అట్రిషన్ 17.4 శాతంగా ఉంది. గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఇది 7.3 శాతంగా ఉంది. డిసెంబర్ 2021 త్రైమాసికంలో కూడా TCS అట్రిషన్ 15.3 శాతంగా ఉంది. గత-పన్నెండు నెలల (LTM) ప్రాతిపదికన అట్రిషన్ శాతం తగ్గుతున్న రేటులో పెరుగుతోందని TCS మేనేజ్‌మెంట్ తెలిపింది. టీసీఎస్ (TCS) , ఇన్ఫోసిస్ (Infosys) 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 61,000 క్యాంపస్ నియామకాలను చేపట్టాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో ఇది అనేక రెట్లు పెరిగింది. TCS , ఇన్ఫోసిస్ FY22లో వరుసగా 1 లక్ష, 85,000 మంది చొప్పున ఫ్రెషర్లను నియమించుకున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu