Ad Code

ప్రభుత్వ ఉద్యోగులెవరూ వీపీఎన్ లను వాడొద్దు !


దేశంలో ప్రభుత్వ ఉద్యోగులు థర్డ్ పార్టీ వర్చువల్‌ ప్రైవేట్ నెట్‌వర్క్ సర్వీసులను ఉపయోగించవద్దు అంటూ భారత ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జాతీయ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఆదేశాలు జారీ చేసింది. నార్డ్ వీపీఎన్, ఎక్స్‌ప్రెస్ వీపీఎన్ ఆఫర్ చేస్తున్న సర్వీసులను వినియోగించవద్దని ఉద్యోగులకు స్పష్టం చేసింది. వాటితో పాటు టార్ సహా మరి కొన్ని సర్వీసులపై ఈ కొత్త ఆదేశాలను అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధిత ఉద్యోగులకు పంపింది. అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన డేటా ఫైల్స్‌ను, అతి ముఖ్యమైన అంతర్గత సమాచారాన్ని ప్రభుత్వేతర క్లౌడ్ విభాగాలైన గూగుల్ డ్రైవ్‌ Google Drive, డ్రాప్‌బాక్స్‌ DropBoxలలో స్టోర్ చేయవద్దని ఆదేశాల్లో పేర్కొంది. సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నివారించడాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఉద్యోగులకు పది పేజీలతో కూడిన కొత్త ఆదేశాలను జారీ చేసింది. " ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన డేటా ఫైల్స్‌ను, అతి ముఖ్యమైన అంతర్గత సమాచారాన్ని ప్రభుత్వేతర క్లౌడ్ విభాగాలైన గూగుల్ డ్రైవ్‌, డ్రాప్‌బాక్స్‌లలో స్టోర్ చేయవద్దు" అని ఉద్యోగులకు స్పష్టం చేసింది. దీనికి సైబర్ సెక్యూరిటీ గైడ్‌లైన్స్ అని పేరు పెట్టింది. ఉద్యోగులందరూ ఈ రూల్స్‌కు కట్టుబడి ఉండాలని పేర్కొంది. లేదంటే సంబంధిత డిపార్ట్‌మెంట్ హెడ్‌లు తగిన చర్యలు తీసుకోవచ్చని కేంద్రం పేర్కొంది. వీటితో పాటు అనధికార రిమోట్ టూల్స్ (ఉదా.. టీమ్ వ్యూవర్‌, ఎనీడెస్క్) వంటి వాటికి దూరంగా ఉండాలని పేర్కొంది. ప్రభుత్వ అధికారిక అకౌంట్ల పాస్‌వర్డ్ నిర్వహణలో కూడా జాగ్రత్తగా ఉండాలని, కఠినమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలని ఉద్యోగులకు ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా, ప్రతీ 45 రోజులకు ఒకసారి పాస్‌వర్డ్ మార్చుకోవాలని తెలిపింది. ప్రభుత్వ అధికారిక సంప్రదింపులకు బయటి ఈ మెయిల్ సర్వీసులు ఉపయోగించవద్దని తెలిపింది. దీనితో పాటు ప్రభుత్వం తమ ఉద్యోగుల్ని మొబైల్ ఫోన్లను రూట్ (Root) లేదా జైల్ బ్రేక్ (Jail Break) చేయవద్దని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను సైబర్ సెక్యూరిటీ పరంగా ఏమి చేయాలి, ఏమి చేయకూడదనే దానిపై అవగాహన కల్పించడానికి, ఈ మార్గదర్శకాలు తీసుకువచ్చినట్లు ఎన్ఐసీ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. అలాగే, రిమోట్‌, వర్చువల్ సమావేశాల థర్డ్ పార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలు పొందవద్దని సూచించింది. ఇప్పటికే భారత్ 2020లో చైనాకు సంబంధించిన టిక్‌టాక్‌, పబ్జీ, సహా పలు యాపలను దేశంలో రద్దు చేసింది. ఆ సమయంలోనే క్యామ్ స్కానర్ యాప్‌ను కూడా రద్దు చేసింది. అయినప్పటికీ చాలా మంది ఉద్యోగులు అధికారిక డాక్యూమెంట్లను స్కాన్ చేయడానికి క్యామ్ స్కానర్ యాప్ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu