Ad Code

ఆటుమొబైల్ నుంచి మరో ఎలక్ట్రిక్ బైక్ !


ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్ అయిన ఆటుమొబైల్ నుంచి మరో ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. ఆటుమ్‌వేడర్ పేరుతో ఈ బైక్‌ను కంపెనీ రిలీజ్ చేసింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులోని పటాన్‌చెరులో ఈ బైక్ తయారవుతుంది. 3,00,000 ఎలక్ట్రిక్ బైకుల్ని తయారు చేయగల సామర్థ్యం తమ దగ్గర ఉందని కంపెనీ చెబుతోంది. ఆటోమోటీవ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ బైక్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. ఆటుమ్‌వేడర్ ఎలక్ట్రిక్ బైక్ విషయానికి వస్తే ఈ వాహనాన్ని రూ.99,999 ధరకు లాంఛ్ చేసింది కంపెనీ. ఇది ఇంట్రడక్టరీ ధర మాత్రమే. తొలి 1,000 మందికి మాత్రమే ఈ ధర వర్తిస్తుంది. కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కేవలం రూ.999 చెల్లించి ఆటుమ్‌వేడర్ ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రీ-ఆర్డర్ చేయొచ్చు. ఆటుమ్‌వేడర్ ఎలక్ట్రిక్ బైక్ ఐదు కలర్స్‌లో లభిస్తుంది. రెడ్, వైట్, బ్లూ, బ్లాక్, గ్రే కలర్స్‌లో కొనొచ్చు. ఇది ఎలక్ట్రిక్ కేఫ్ రేసర్ బైక్‌గా కంపెనీ చెబుతోంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.  ఆటుమ్‌వేడర్ ఎలక్ట్రిక్ బైకులో 2.4kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. పూర్తిగా ఛార్జింగ్ చేయడానికి 5 గంటల నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఇందులోని బ్యాటరీని స్వాప్ చేయొచ్చు. ట్యూబ్యులర్ చేసిస్‌పై దీన్ని తయారు చేశారు. 14 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. భారతీయ రోడ్లు, వాహనదారుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ బైక్ రూపొందించినట్టు కంపెనీ చెబుతోంది. ఆటుమ్‌వేడర్ ఎలక్ట్రిక్ బైక్ సింగిల్ సీటర్ బైక్ మాత్రమే. సెల్ఫ్ స్టార్టింగ్ ఫీచర్ ఉంది. ఎల్ఈడీ ఇండికేటర్లు, టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. డిజిటల్ స్పీడో మీటర్, రీజెనరేటీవ్ బ్రేకింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ బైక్ నడపాలంటే రిజిస్ట్రేషన్ నెంబర్, లైసెన్స్, హెల్మెట్ తప్పనిసరి. ఆటుమొబైల్ నుంచి వచ్చిన తొలి బైక్ కాదు ఇది. 2020 అక్టోబర్‌లో ఆటుమ్ 1.0 పేరుతో ఓ బైక్ రిలీజైంది. ఇప్పటి వరకు 1000 యూనిట్స్ అమ్మింది కంపెనీ. ఆటుమ్ 1.0 లో స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్. లేటెస్ట్‌గా రిలీజైన ఆటుమ్‌వేడర్ హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్. స్పీడ్ విషయానికి వస్తే గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఈ బైక్ బరువు 96 కిలోలు. 

Post a Comment

0 Comments

Close Menu