Ad Code

క్యూఆర్ కోడ్ పేమెంట్ ప్రారంభించిన ఐఆర్‌సీటీసీ


ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్  రైళ్లల్లో పేమెంట్స్ కోసం క్యూఆర్ కోడ్ పేమెంట్ సిస్టమ్ ప్రారంభించింది. రైల్వే ప్రయాణికులు రైళ్లల్లో ఫుడ్ కొంటే నగదు రూపంలో చెల్లింపులు చేయాల్సి వస్తోంది. భారతదేశంలో ప్రతీ చిన్న షాపులో కూడా డిజిటల్ పేమెంట్స్ విధానానికి అలవాటుపడుతున్నారు. అయితే రైళ్లల్లో ఆహారపదార్థాలు కొంటే క్యాష్ చెల్లించాల్సిన పరిస్థితి ఇప్పటికీ ఉంది. దీంతో రైల్వే ప్రయాణికులకు డిజిటల్ పేమెంట్స్ వెసులుబాటు కల్పించేందుకు ఐఆర్‌సీటీసీ క్యూఆర్ కోడ్ పేమెంట్ సిస్టమ్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సదుపాయం కేవలం ఒక రూట్‌లోనే అందుబాటులో ఉంది. సంపూరణ్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో మాత్రమే క్యూఆర్ కోడ్ పేమెంట్ సిస్టమ్ ప్రారంభమైంది. త్వరలో మరిన్ని రైళ్లల్లో కూడా డిజిటల్ పేమెంట్స్ విధానం అందుబాటులోకి రానుంది. శతాబ్ది, తేజస్, దురంతో, రాజధాని ఎక్స్‌ప్రెస్ లాంటి ప్రీమియం రైళ్లల్లో టికెట్ ఛార్జీల్లోనే కేటరింగ్ ఛార్జీలు కలిపి ఉంటాయి. ఇక కొన్ని రైళ్లల్లో ప్యాంట్రీ కార్ ఉన్నా ప్రయాణికులు నగదు రూపంలోనే చెల్లించాలి. ఇక ఐఆర్‌సీటీసీ వెండార్స్ సప్లై చేసే ఫుడ్‌కి సిబ్బంది డిజిటల్ పేమెంట్స్ అంగీకరిస్తే చెల్లింపులు చేయొచ్చు. రైళ్లల్లో ఆహారపదార్థాలు అమ్మే ఐఆర్‌సీటీసీ వెండార్స్ అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని రైల్వేకు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. కార్డ్ స్వైప్ చెల్లింపు సౌకర్యం ఇప్పటికే అందుబాటులో ఉన్నా, ఆ విషయం తెలియని ప్రయాణికులు నగదు ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పుడు క్యూఆర్ కార్డ్ చెల్లింపు విధానం ప్రవేశపెట్టడంతో ఆహార పదార్థాలపై అధిక ఛార్జీలు చేస్తే ఆ విషయాన్ని రైల్వే దృష్టికి తీసుకెళ్లడం ప్రయాణికులకు సులువవుతుంది. ఐఆర్‌సీటీసీ క్యూఆర్ కోడ్ మెను కార్డులపై ఉంటుంది. ఐఆర్‌సీటీసీ వెండార్స్ ఐడీ కార్డులపైనా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ప్రయాణికులు తమ యూపీఐ యాప్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేయొచ్చు. మెనూలో ఎంత ఉంటుందో అంతే చెల్లించవచ్చు. ఐఆర్‌సీటీసీ వెండార్స్ అధికంగా వసూలు చేసే అవకాశం ఉండదు. రైళ్లల్లో సాత్వికమైన ఆహారం అందించడానికి ఢిల్లీ ఇస్కాన్ టెంపుల్‌తో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది ఐఆర్‌సీటీసీ. త్వరలో ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో గోవింద రెస్టారెంట్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఇతర స్టేషన్‌లలో కూడా గోవింద రెస్టారెంట్లు ప్రారంభం కానున్నాయి. ఈ రెస్టారెంట్‌లోని మెనూలో డీలక్స్ థాలీ, మహారాజా థాలీ, వెజిటేబుల్ బిర్యానీ, వెజిటేబుల్ డిమ్ సమ్, పన్నీర్ డిమ్ సమ్, వోక్ టాస్ నూడుల్స్, దాల్ మఖానీ వంటి సాత్విక వంటకాలు ఉన్నాయి. ప్రయాణికులు రైలు బయల్దేరడానికి రెండు గంటల ముందు పీఎన్ఆర్ నెంబర్‌తో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయాలి. రైలు స్టేషన్‌కు చేరుకోగానే ప్రయాణికుల బెర్త్ వద్దకే ఫుడ్ డెలివరీ అవుతుంది.

Post a Comment

0 Comments

Close Menu