Ad Code

తిరుపతిలో 'స్పేస్‌ ఆన్‌ వీల్స్‌' మొబైల్ ఎక్స్‌పో !


మినియేచర్‌ రాకెట్‌ నమూనాలతో కూడిన 'స్పేస్‌ ఆన్‌ వీల్స్‌' ఎక్స్‌పో విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. సతీష్‌ ధావన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు రూపొందించిన అనేక రాకెట్‌ నమూనాలతోపాటు లాంచ్‌ ప్యాడ్స్‌, చంద్రయాన్‌ మిషన్‌-1, మంగళ్యాణ్‌ వంటివి ఎన్నో విద్యార్థులను కట్టిపడేస్తున్నాయి. మూడు రోజులుగా తిరుపతిలోని పలు ప్రాంతాల్లో, పాఠశాలల్లో ప్రదర్శనలిస్తూ విద్యార్థులతోపాటు సామాన్య ప్రజానీకాన్ని ఎంతో ఉర్రూతలూగిస్తున్నది. ప్రదర్శనకు పెట్టిన వివిధ రాకెట్లు, లాంచింగ్‌ ప్యాడ్ల గురించి అధికారులు విపులంగా చెప్తూ వారికి అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన విజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని ప్రతి మంత్రిత్వ శాఖ గత 75 ఏండ్లలో సాధించిన విజయాలను ప్రదర్శించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే అంతరిక్ష శాఖకు చెందిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ ఎగ్జిబిషన్‌తో 'స్పేస్ ఆన్ వీల్స్'కు శ్రీకారం చుట్టింది. పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శనకు పెట్టి విద్యార్థులతో పాటు సాధారణ ప్రజలను విశేషంగా ఆకర్శిస్తున్నది. జిల్లా విద్యాశాఖతో కలిసి షార్ అధికారులు ఈ మొబైల్ ఎగ్జిబిషన్ వాహనాన్ని తిరుపతి నగరంలోని మూడు చోట్ల అందుబాటులో ఉంచారు. ఈ ప్రదర్శనలో పెట్టిన స్కేల్ డౌన్ నమూనాలు, సూక్ష్మ ఉపగ్రహ నమూనాలు, ఉపగ్రహాల సాంకేతిక మోడల్స్‌ పాఠశాల విద్యార్థుల్లో సైన్స్ అండ్‌ టెక్నాలజీపై ఆసక్తి కలిగిస్తాయని షార్‌ అధికారులు భావిస్తున్నారు. 'స్పేస్ ఆన్ వీల్స్'లో మొదటి, రెండో లాంచ్ ప్యాడ్‌ల నమూనాలతోపాటు చంద్రయాన్ - 1 మిషన్, మంగళయాన్, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్‌, ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌), ఇండియన్ శాటిలైట్ కమ్యూనికేషన్ అప్లికేషన్స్‌ ప్రదర్శనలో ఉంచారు.

Post a Comment

0 Comments

Close Menu