Ad Code

గూగుల్‌ లో స్నాక్స్, లంచ్, లాండ్రీ సర్వీస్ ల నిలిపివేత !


గూగుల్ కంపెనీ లో ఉద్యోగమంటే సకల సౌకర్యాలు ఉంటాయని, అందులో జాబ్ వచ్చిందంటే లైఫ్ సెటిల్ అని భావించడం గత వైభవంగా మారనుంది. ప్రపంచంలో అత్యంత విలువైన టెక్ కంపెనీల్లో అగ్ర స్థానంలో ఉన్న గూగుల్ ఇప్పుడు పొదుపు మంత్రం జపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితిని తట్టుకొని నిలబడాలంటే ఉన్న డబ్బును పొదుపుగా వాడుకొని, దూబారా ఖర్చుల్ని తగ్గించుకోవాలని చూస్తోంది. అందుకే ఇప్పటి వరకు ఉద్యోగులకు అందించిన అన్ని ప్రోత్సాహకాల్ని రద్దు చేయడంతో పాటు, నియామకాల్ని తగ్గించడం ద్వారా పొదుపు చర్యలు ప్రారంభించింది. తన ఉద్యోగులకు స్పెషల్ అలవెన్స్ లు ఇచ్చి మరీ ప్రోత్సహించిన గూగుల్, ఇక నుంచి వాటిని నిలిపివేయనుంది. స్నాక్స్, లంచ్, లాండ్రీ సర్వీస్  ఇలాంటి వసతులన్ని నిలిపేయాలని నిర్ణయం తీసుకుంది. పొదుపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్  రూత్ పోరాట్ ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు. ఆహార వృధాను అరికట్టడంతో పాటు పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు ఈ చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఈ ఉచిత సౌకర్యాలకు పెట్టే డబ్బుతో వేరే ఇతర ప్రాధాన్యాల వైపు మళ్లించడమే తమ లక్ష్యమని ఆ లేఖలో స్పష్టం చేశారు. కొత్త నియామకాలను కూడా తగ్గించామని.. ప్రస్తుతమున్న ఉద్యోగులను హై ప్రయారిటీ పనులకు వినియోగించుకుంటామని రూత్ పోరాట్ తెలిపారు. ఉద్యోగులకు ఇచ్చే ల్యాప్టాప్ల కొనుగోలును కూడా తగ్గించనున్నట్టు చెప్పారు. అయితే, ఈ ప్రోత్సాహకాల కుదింపు ఆఫీసులు ఉన్న ప్రాంతాలు.. అక్కడ ఉండే వసతులను బట్టి మారుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా ఎక్కువ ప్రాధాన్యం ఉన్న వాటికే కంపెనీ ఇన్వెస్ట్ చేస్తోంది. దీంతో ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది.


Post a Comment

0 Comments

Close Menu