విండోస్ 11 విడుదలకు ముందు నుంచే ఆసక్తిరేపింది. అయితే ఈ ఓఎస్ అప్‌డేట్ కావాలంటే మాత్రం కంప్యూటర్‌లో కొన్ని కనీస ఫీచర్లు ఉండాలని మైక్రోసాఫ్ట్ సూచించింది. చాలా మంది యూజర్స్ తమ కంప్యూటర్లలో విండోస్ 11 పనిచేయడం లేదని ఫిర్యాదు చేయడంతోపాటు మైక్రోసాఫ్ట్ కనీస ఫీచర్ల పరిమితిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. రష్యాకు చెందిన గుస్తావే మోన్సే అనే ఇంజనీరింగ్ విద్యార్థి విండోస్ 11 ఓఎస్‌ను మైక్రోసాఫ్ట్ లుమియా 950 ఎక్స్‌ఎల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేశాడు. దానికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేస్తూ..విండోస్ 11 ఫోన్‌లో కూడా చక్కగా పనిచేస్తుందని తెలిపాడు. యూజర్ ఇంటర్‌ఫేస్ లుమియా ఫోన్‌కు చక్కగా ఉందని, దాదాపు అన్ని యాప్‌లు చక్కగా పనిచేస్తున్నట్లు వెల్లడించాడు. కంప్యూటర్ తరహాలోనే టాస్క్‌బార్ కూడా ఫోన్ కింది భాగంలో కనిపిస్తోంది. స్టార్ట్, సెర్చ్ బటన్‌తోపాటు స్క్రీన్ ఎడమవైపున విడ్జెట్స్ ఆప్షన్ కూడా ఉంది. అయితే కంప్యూటర్‌తో పోలిస్తే ఫోన్‌లో విండోస్ 11 పనితీరు కొంచెం మందకొడిగా ఉంది. లుమియా ఫోన్లలో విండోస్ ఓఎస్ ఇన్‌స్టాల్ చేయడం వెనక తన నాలుగేళ్ల శ్రమ ఉందని చెబుతున్నాడు మోన్సే. ఇందుకోసం 15 మంది మిత్రబృందంతో కలిసి విండోస్ ఆన్ విండోస్ ఫోన్స్ పేరుతో ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపాడు. అలానే తమ విండోస్ ఫోన్లలో విండోస్ 10 లేదా విండోస్ 11 ఓఎస్ ఇన్‌స్టాల్ చేయాలకునే ఔత్సాహికుల కోసం తమ వెబ్‌సైట్ ద్వారా అవసరమైన టూల్స్, గైడ్‌లైన్స్‌తో సహకారం అందిస్తున్నట్లు తెలిపాడు.