అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ వాల్ట్ డిస్నీ ఇండియాని అంబానీ చేజిక్కించుకోన్నారని వినిపిస్తున్నాయి. అదే నిజమైతే అంబానీ దేశంలో తిరుగులేని శక్తిగా అవతరిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలోకి ప్రవేశించిన రిలయన్స్ ఇప్పుడు ఆ రంగంలో టాప్ ప్లేస్‌లో ఉన్న డిస్నీని కొనుగోలు చేస్తే మార్కెట్ మొత్తం రిలయన్స్ చేతిలోకి వెళ్లినట్లు అవుతుంది. వాల్ట్ డిస్నీకు సంబంధించి, ఇండియాలో టెలివిజన్ సహా డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారం మొత్తాన్ని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బ్లూమ్ బర్గ్ అనే వార్తా సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. అవసరం అయితే హాట్‌స్టార్, స్పోర్ట్స్ హక్కులను కూడా అమ్మేయలని చూస్తోందని చెప్పింది. ఇప్పటికే పలువురు కొనుగోలుదారులతో సైతం చర్చలు జరిపినట్లు వివరించింది. అయితే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దీనిపై ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార హక్కుల ద్వారా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దేశంలో చొచ్చుకుపోయింది. భారీ ఎత్తున సబ్ స్క్రైబర్లు వచ్చి చేరారు. అయితే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ ప్రసార హక్కులను రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18 దక్కించుకుంది. దీంతో జియో టీవీ ద్వారా ఐపీఎల్ ఫ్రీ స్ట్రీమింగ్ చేసింది. దీంతో హాట్ స్టార్ సబ్‌స్క్రైబర్లు అందరూ జియో వైపు రావడం మొదలుపెట్టారు. ఫలితంగా హాట్ స్టార్ సబ్‌స్క్రైబర్లు తగ్గిపోతూ వచ్చారు. ఈ నేపథ్యంలో డిస్నీ సంస్థ తమ వ్యాపారాన్ని భారతదేశంలో పూర్తిగా నిలిపివేయడం కానీ లేదా సంయుక్తంగా నిర్వహించే విధంగా ప్రయత్నాలు చేసినట్లు కూడా మార్కెట్ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఏకంగా డిస్నీ ఇండియా తన మొత్తం బిజినెస్‌ను అమ్మేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక బహిర్గతం చేయడంతో ఆ వాదనలకు బలం చేకూరినట్లు అయ్యింది.
రిలయన్స్ చేతికి డిస్నీ ఇండియా ?
0
September 20, 2023
Tags