Ad Code

దేశంలో తొలి ఓటీటీ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం


కేరళ 'సీస్పేస్‌' పేరుతో ఓటీటీ సర్వీస్‌లను అందించేందుకు సిద్దమైంది. గురువారం కేరళ సీఎం పినరయి విజయన్‌ ఈ ప్లాట్‌పామ్‌ను ప్రారంభించారు. దేశంలో తొలి ప్రభుత్వ రంగ ఓటీటీ వేదిక ఇదేనని కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్‌ తెలిపారు. ప్రస్తుతం ఓటీటీల్లో ప్రసారమవుతున్న కంటెంట్‌ ఎంపికలో చాలా తేడాలున్నాయని కేరళ రాష్ట్ర ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ షాజీ ఎన్‌ కరున్‌ తెలిపారు. వాటి ప్రసారాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. వాటికి ప్రతిస్పందనగా సీస్పేస్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌, ఐఓఎస్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఓటీటీలో రూ.75 ధరకే యూజర్లు సినిమా చూడొచ్చు. తక్కువ నిడివి ఉన్న కంటెంట్‌ను సగం ధరకే వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. 'పే ఫర్ వ్యూ' ఆధారంగా నిర్మాతలకు చెల్లింపులు చేస్తారు. నూతన దర్శకులు తమ చిత్రాల కోసం సీస్పేస్ ద్వారా క్రౌడ్‌ ఫండింగ్‌ చేసుకోవచ్చు. నిర్మాతలు తమ చిత్రాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేయడం వల్ల లాభాలు తగ్గుతున్నాయని పలువురు ఎగ్జిబిటర్లు, పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం థియేటర్లలో విడుదలైన సినిమాలను మాత్రమే సీస్పేస్‌లో విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కంటెంట్‌ను ఎంపిక చేసేందుకు 60 మంది సభ్యులతో కూడిన ప్యానెల్‌ నియమించారు. సీస్పేస్‌ కోసం ఇప్పటి వరకు 42 చిత్రాలను ఎంపిక చేశారు. ప్యానెల్‌ అనుమతి పొందిన షార్ట్‌ ఫిల్మ్స్‌, డాక్యుమెంటరీలు, ప్రయోగాత్మక చిత్రాలను స్ట్రీమింగ్‌ చేస్తారు. ఈ ఓటీటీ ద్వారా వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని చిత్ర పరిశ్రమలో ఉపాధిలేని నిపుణుల సంక్షేమం కోసం వినియోగించనున్నట్లు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu