Ad Code

ఎలక్ట్రిక్‌ వాహనాలకు రాయితీ అందించేందుకు ఇ-మొబిలిటీ ప్రమోషన్‌ స్కీమ్‌ !


విద్యుత్తు వాహనాల కొనుగోలును ప్రోత్సహించడంలో భాగంగా కేంద్రం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రిక్‌ వాహనాలకు రాయితీ అందించేందుకు ఇ-మొబిలిటీ ప్రమోషన్‌ స్కీమ్‌ ను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి మహేంద్రనాథ్‌ పాండే బుధవారం వెల్లడించారు. ఈ పథకం కోసం రూ.500 కోట్లు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకం కింద విద్యుత్తు ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలపై రాయితీ ఇవ్వనున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ఈ స్కీమ్‌ అమల్లోకి రానుంది. నాలుగు నెలల పాటు అమల్లో ఉంటుంది. అంటే 2024 జులైతో ఈ పథకం ముగుస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ పథకం కింద 3.3 లక్షల విద్యుత్తు ద్విచక్ర వాహనాలకు గరిష్ఠంగా రూ.10వేల రాయితీ ఇవ్వనున్నారు. 31 వేల ఇ-రిక్షాలపై రూ.25 వేల సబ్సిడీ లభిస్తుంది. పెద్ద త్రిచక్ర వాహనాలపై రూ.50వేలు రాయితీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ రెండో దశ (FAME-II) పథకం 2024 మార్చి 31తో ముగియనుంది. టూవీలర్లు సహా మిగిలిన విద్యుత్‌ వాహనాలకు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ వచ్చింది. ఈ గడువు మరోసారి పెంచే ఆలోచనలో లేదని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో ఈవీల కోసం కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu